‘మున్సిపల్స్‌’ ‘కో-ఆప్షన్’ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు

by Malleboina Mahesh |

మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ‘కో-ఆప్షన్’ పదవులు.. చట్ట సవరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం, త్వరలోనే ఉత్తర్వులు!

‘మున్సిపల్స్‌’ ‘కో-ఆప్షన్’ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే వారి కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేయడంతో పాటు బ్యాంకు రుణాలు ఇప్పించినట్టు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణలోనూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగానే మున్సిపల్ చట్టం-2019 సవరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు మున్సిపల్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో 544 మంది..

రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 9 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఐదుగురి చొప్పున 60మంది, 121 మున్సిపాలిటీల్లో 484మంది కో-ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సగానికిపైగా మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యులను నియామకాలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రక్రియ కొనసాగుతోంది.

12 మంది ట్రాన్స్‌జెండర్లకు..

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)లతో కలిపి 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో మొత్తం 60 మంది కో-ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. వీరిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఒకరి చొప్పున 12 మంది ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఒక్కో కార్పొరేషన్‌లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. వీటిలో ఏడుగురు ట్రాన్స్‌జెండర్లకు అవకాశం రానుంది. అయితే ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్‌లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులకుగాను ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరొకరు ట్రాన్స్‌జెండర్ ఉంటారు. మరో ఇద్దరు మైనారిటీ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. అయితే ఐదుగురిలో కనీసం ఇద్దరికి రాజకీయ పార్టీలకు సంబంధించిన మాజీ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే క్యూర్ డ్రాఫ్ట్ బిల్లులో..

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)లో ‘ది కోర్ అర్బన్ రీజియన్(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్-2026లో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించే అంశాన్ని ప్రభుత్వం చేర్చింది. దీంతో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలో ఒక్కోదానిలో ఒక్కొక్కరికి అవకాశం దక్కనుంది. అయితే రాష్ట్రంలోని 9 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన మున్సిపల్ చట్టం-2019ను సవరించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ అధికారులు మార్గదర్శకాలు తయారు చేసిన తర్వాత ఇప్పటికే ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కొక్కరి చొప్పున ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలోనూ వీరిని కో-ఆప్షన్ సభ్యులుగా నియమించనున్నారు.

Next Story