విజయనగరంలో RIL ఏఐ డేటా సెంటర్‌: భూ కేటాయింపు జీవోలో ప్రభుత్వం కీలక సవరణలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా నెట్‌వర్కింగ్ రంగాన్ని విస్తరించడంలో ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తోంది.

విజయనగరంలో RIL ఏఐ డేటా సెంటర్‌: భూ కేటాయింపు జీవోలో ప్రభుత్వం కీలక సవరణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం విజయనగరం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో కూడిన గిగా-స్థాయి ఏఐ (AI) డేటా సెంటర్ భూ కేటాయింపు ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు భూముల అప్పగింతను మరింత వేగవంతం చేసేందుకు గతంలో జారీ చేసిన భూ కేటాయింపు జీవో నెం.30లో కీలక సవరణలు చేస్తూ తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ డిపార్టుమెంట్ నేరుగా ఏపీఐఐసీ (APIIC)కి భూములను అప్పగించాల్సి ఉంది. అలాగే సదరు భూమి ఖరీదులో 75 శాతం మొత్తాన్ని ఏపీఐఐసీకి చెల్లించాలని సూచించారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం, ఆర్‌ఐఎల్‌ (RIL) సంస్థకు అవసరమైన భూమిని సమకూర్చే బాధ్యతను పూర్తిస్థాయిలో ఏపీఐఐసీకే అప్పగించారు. ఒకవేళ ప్రతిపాదిత ప్రాంతంలో సరిపోయేంత స్థలం లేని పక్షంలో ప్రత్యేకంగా భూసేకరణ (Land Acquisition) చేపట్టి అయినా సరే ఆర్‌ఐఎల్‌కు భూమిని అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా నెట్‌వర్కింగ్ రంగాన్ని విస్తరించడంలో భాగంగా ఆర్‌ఐఎల్‌ ఏర్పాటు చేస్తున్న ఈ గిగా-స్కేల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది. తాజాగా సవరించిన జీవోతో ప్రాజెక్ట్ పనులు వేగవంతం కానున్నాయి.

Next Story