- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్..
ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దృష్టి మళ్లింపు దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, కోరుట్ల రూరల్: అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దృష్టి మళ్లింపు దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ లక్ష్మి నారాయణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఠా వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేటకు చెందిన అల్లెపు కృష్ణ (51), కుంచెపు శ్రీకాంత్ (30), అల్లెపు రాజ్‌కుమార్ (28)లు సిద్దిపేట ప్రాంతంలో గుర్తుపట్టే అవకాశం ఉండటంతో ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో కోరుట్లకు వచ్చారు. జూలై 15న స్థానిక లాడ్జిలో బస చేసిన నిందితులు, మరుసటి రోజు బస్టాండ్ పరిసరాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు.
మొబైల్ ఫోన్లు స్వాధీనం
ఈ క్రమంలో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని పరిచయం చేసుకుని, ఆమెకు పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచిస్తామని నమ్మించారు. అనంతరం ఎస్‌బీఐ బ్యాంకు సమీపానికి తీసుకెళ్లి, బంగారు ఆభరణాలు ధరించి ఉంటే పెన్షన్ రాదని మాయమాటలు చెప్పి మెడలో ఉన్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసును తీసుకున్నారు. ఫారాలు తీసుకొస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. మరిన్ని దొంగతనాలకు పాల్పడేందుకు లాడ్జిలోనే ఉన్న నిందితులను కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని చట్టపరమైన పంచనామా నిర్వహించారు. విచారణలో ప్రధాన నిందితుడు అల్లెపు కృష్ణపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదైనట్లు, మిగిలిన ఇద్దరిపై కూడా పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపర్చేందుకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని ఆయన కోరారు.






