బౌండ్ ఓవర్ ఉల్లంఘనపై రౌడీషీటర్‌కు రూ.20 వేల జరిమానా

by Kodari Anjali |

ఓ రౌడీషీటర్‌కు విధించిన జరిమానా మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు చెల్లించిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బౌండ్ ఓవర్ ఉల్లంఘనపై రౌడీషీటర్‌కు రూ.20 వేల జరిమానా
X

దిశ, చంపాపేట్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్ సిటీ పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా బౌండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ రౌడీషీటర్‌కు విధించిన జరిమానా మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు చెల్లించిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రౌడీషీటర్ గడ్డం అక్షయ్ కుమార్ బౌండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను గౌరవ న్యాయస్థానం ఈ నెల 14వ తేదీన రూ.30 వేల ఫోర్‌ఫిచర్ జరిమానా విధించింది. అనంతరం జరిమానా మొత్తాన్ని తగ్గించాలని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ) ఎదుట అక్షయ్ కుమార్ వినతిపత్రం సమర్పించాడు.

చట్టబద్ధంగా నియంత్రించేందుకు..

వినతిని పరిశీలించిన న్యాయస్థానం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జరిమానాను రూ.30 వేల నుంచి రూ.20 వేలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 21న గడ్డం అక్షయ్ కుమార్ రూ.20 వేల జరిమానాను ప్రభుత్వ ఖజానాలో జమ చేశాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు మాట్లాడుతూ, బౌండ్ ఓవర్ అనేది శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను చట్టబద్ధంగా నియంత్రించేందుకు తీసుకునే ముందస్తు చర్య అని తెలిపారు. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో నేరాలను అరికట్టడం, ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఇటువంటి నివారణ చర్యలను మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తామని చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.

Next Story