- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి, అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నరసింహ (ఐపీఎస్) మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు.

దిశ చింతలపాలెం : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నరసింహ (ఐపీఎస్) మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు విధానం, శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, చింతలపాలెం మండలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఉండటంతో భద్రతాపరంగా అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, పులిచింతల జలవిద్యుత్ కేంద్రం, రిజర్వ్ అటవీ ప్రాంతాలు, మైనింగ్ కార్యకలాపాలు అధికంగా ఉన్నందున ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలైన కిష్టాపురం, పీక్లా నాయక్ తండా, తమ్మారం, గుడి మల్కాపురం గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ నరసింహ తెలిపారు. అక్రమ మార్గాలను గుర్తించి కట్టడి చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని చెప్పారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చింతలపాలెంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు ప్రతి వారం పర్యవేక్షించాలని, నిర్మాణం పూర్తయిన వెంటనే శాశ్వత భవనంలోకి స్టేషన్‌ను మార్చనున్నట్లు తెలిపారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో పోలీస్ స్టేషన్ పరిధిలో కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కట్టుబడి పనిచేస్తామని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణ రెడ్డి, ఎస్‌ఐ పరమేష్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






