- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరు పడకలకే పరిమితమా?
నారాయణపేట జిల్లాగా మారినప్పటికీ వైద్య సేవలు మాత్రం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.

దిశ, ధన్వాడ: నారాయణపేట జిల్లాగా మారినప్పటికీ వైద్య సేవలు మాత్రం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మక్తల్, కోస్గి, నారాయణపేటలో మాత్రమే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉండగా మిగిలిన మరికల్, దామరగిద్ద, కృష్ణ, మాగనూర్, ధన్వాడ, ఉట్కూర్, గుండుమల్, పులిమామిడి, కోటకొండ తదితర ప్రాంతాలన్నీ కేవలం ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఏళ్ల తరబడిగా ఈ పీహెచ్‌సీలు ఆరు పడకలకే పరిమితం కావడం వల్ల బీద రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందడం లేదు. జనాభా ప్రాతిపదికన మరికల్, ధన్వాడ, ఉట్కూర్ వంటి పెద్ద మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలను 30 పడకల ఆసుపత్రులుగా (సీహెచ్‌సీ) అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్నా, అధికారులు కానీ, పాలకులు కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మారినా పీహెచ్‌సీల తలరాత మారకపోవడంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ ధన్వాడ ఆస్పత్రి!
ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఆసుపత్రి భవనం పూర్తిగా అధ్వానంగా తయారైంది. ప్రతి ఏటా తాత్కాలిక మరమ్మతుల పేరిట నిధులు మంజూరు చేయడం, వాటిని గుత్తేదారులు, అధికారులు కలిసి స్వాహా చేయడం ఇక్కడ నిరంతర ప్రక్రియగా మారింది. గత ఏడాది తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరైనా.. గుత్తేదారు తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకోగా, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బిల్లులు పాస్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ దవాఖానాలో కనీసం లైట్లు వెలగవు, తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే పైకప్పు మొత్తం కారి వార్డులన్నీ జలమయమవుతున్నాయి. ఎన్నికల వేళ 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామని నేతలు ఇచ్చే హామీలు ఓట్ల లెక్కింపు ముగియగానే అటకెక్కుతున్నాయి.
రికార్డు స్థాయిలో ప్రసవాలు.. కన్పించని గైనకాలజిస్ట్‌లు
ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే స్తోమత లేక నిరుపేద కుటుంబాలు పీహెచ్‌సీలను ఆశ్రయిస్తుండటంతో ప్రసవాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దామరగిద్దలో 2,452, ధన్వాడలో 986, గుండుమల్‌లో 2,002, కర్నిలో 2,716, కోటకొండలో 2,426, మద్దూరులో 2,314, మాగనూరులో 1,684, మరికల్‌లో 1,066, నర్వలో 1,646, పులిమామిడిలో 1,435, ఉట్కూరులో 838, నారాయణపేట కేంద్రంలో 898 ప్రసవాలు జరిగాయి. ఇంత పెద్ద సంఖ్యలో కాన్పులు జరుగుతున్నా పీహెచ్‌సీల్లో గైనకాలజిస్ట్(స్త్రీల వైద్య నిపుణులు) లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం సీహెచ్‌సీల్లోనే గైనకాలజిస్టులు ఉంటారని అధికారులు చెబుతున్నప్పటికీ గర్భిణుల రద్దీ దృష్ట్యా నెలకు ఒక్కసారైనా ప్రత్యేక వైద్యులను అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆసుపత్రుల స్థాయిని పెంచాలి:గుర్రం రాజు, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నారాయణపేట
జిల్లాలో జనాభాకు అనుగుణంగా రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు గర్భిణులు, బాలింతల తాకిడి ఎక్కువగా ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఆరు పడకల ఆసుపత్రులను 30 పడకల స్థాయికి పెంచాలి. నిరుపేద మహిళల కోసం పీహెచ్‌సీలలో నెలకు కనీసం ఒకసారైనా గైనకాలజిస్టులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి.






