పాత కక్షలతో రౌడీ షీటర్ దారుణ హత్య

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-21 03:38:46  IST  )

పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్థ రాత్రి చోటుచేసుకుంది.

పాత కక్షలతో రౌడీ షీటర్ దారుణ హత్య
X

దిశ, మీర్ పేట్: పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్థ రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంకు చెందిన రౌడీ షీటర్ సూరి గతంలో తన భార్యతో పాటు బామ్మర్ది సల్మాన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపాడు. ఇటీవల పోలీసులు అతన్ని నగర బహిష్కరణ కూడా చేశారు. గత రాత్రి ఓ స్నేహితుడి పుట్టినరోజు కోసం నందనవనం టీకేఆర్ కాలేజ్ సమీపానికి వచ్చాడు. మాజీ రౌడీ షీటర్ సల్మాన్ సోదరుడు హత్య చేశాడని మనసులో పెట్టుకొని సూరితో సల్మాన్ సోదరుడు అప్రోజ్‌ గత కొంతకాలంగా స్నేహం చేస్తున్నట్టు నటించి పథకం ప్రకారం గత రాత్రి అతని టి కే ఆర్ కాలేజీ సమీపానికి పిలిచారు.

సూరి అక్కడికి చేరుకోగానే ఆఫ్రోజ్ పెప్పర్ స్ప్రే చల్లి కత్తులతో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డితో పాటు ఇన్‌స్పెక్టర్ శోభన తన సిబ్బందితో చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తం మడుగులో ఉన్న సూరీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సూరి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story