4 వేల ఏళ్ల చరిత్రకు ప్రపంచ గుర్తింపు.. ముడుమాల్ నిలువురాళ్లపై యునెస్కో దృష్టి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని మరో పురాతన చారిత్రక కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది.

4 వేల ఏళ్ల చరిత్రకు ప్రపంచ గుర్తింపు.. ముడుమాల్ నిలువురాళ్లపై యునెస్కో దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మరో పురాతన చారిత్రక కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. 2021లో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కింది. అలాగే నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో సుమారు నాలుగేళ్ల నాటి నిలువురాళ్ల(మెగాలిథిక్ యుగం)కు గతేడాది మార్చిలో ఆ జాబితాలో చోటుదక్కింది. ఇక్కడి రాళ్లకు ఖగోళ, పురాతన చారిత్రిక, సాంస్కృతిక ప్రాముఖ్యం ఉంది. రాతి నిర్మాణాల్లో ఓ పెద్ద బండరాయిపై ఆకాశంలోని నక్షత్రాలను(సప్తర్షి మండలం, సింహ రాశి వంటివి) పోలిన గుర్తులు చెక్కి ఉన్నాయి. దక్షిణాసియాలో ఇలాంటి నక్షత్రాల పటం లభించడం ఇదే తొలిసారి అని చరిత్రకారులు తెలిపారు. 80 మెన్హిర్ లు 80 ఎకరాల విస్తీర్ణంలో 10 నుంచి 14 అడగుల ఎత్తులో ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ స్టోన్‌హెంజ్ తరహాలోనే ఇక్కడి రాళ్లను ఆది మానవులు సూర్యోదయం, సూర్యాస్తమయం, నక్షత్రాలు, సూర్య, చంద్రగ్రహణాలు, ఖగోళ అంశాలను గుర్తించేందుకు ఈ రాళ్లను ఉపయోగించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ రాళ్లను స్థానికులు నీలరాళ్ల తిమ్మప్ప అని పిలుస్తూ పవిత్రంగా పూజిస్తారని, ఓ పెద్దరాయిని ఎల్లమ్మ తల్లిగా కొలుస్తారని అధికారులు వివరించారు. ముడుమాల్ రాతి కట్డడాలను ప్రపంచ వారసత్వ శాశ్వత జాబితాలోకి చేర్చేందుకు రాష్ట్ర పర్యాటక, వారసత్వశాఖతో పాటు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సైతం పనిచేస్తోందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

తవ్వకాలకు ఏఎస్ఐ అనుమతి

ముడుమాల్ లో తవ్వకాలకు భారత పురావస్తుశాఖ అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. ఈ తవ్వకాల్లో వెలుగు చూసే వస్తువులు, ప్రాచీనంగా వాడిన పరికరాలు బయటపడితే ఎంతో చరిత్ర బయటికొస్తుందని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ తెలిపారు. మరోవైపు జిల్లా అధికారులు ముడుమాల్ అంశంపైన ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని పరరిక్షించుకునే చర్యలు తీసుకోవడంతో పాటు యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం కార్యాచరణ తీసుకుంటున్నారని ఆయన వివరించారు.

Next Story