- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసైన్మెంట్ భూములను అటవీ భూములుగా మార్చారు
అసైన్మెంట్ భూములను అటవీ భూములుగా నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మానవతా దృక్పథంతో స్పందించి తమకు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని లింగంపేట గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

దిశ, లింగంపేట : తాతల కాలం నుంచి సాగు చేస్తున్న అసైన్మెంట్ భూములను అటవీ భూములుగా నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మానవతా దృక్పథంతో స్పందించి తమకు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని లింగంపేట గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు వినతిపత్రం అందజేశారు. లింగంపేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 983లో సుమారు 70 ఏళ్ల క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు గ్రామానికి చెందిన 181 మంది నిరుపేద రైతులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని పేర్కొన్నారు.
అదే సర్వే నంబర్‌లో రైతు వేదిక, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ హాస్టళ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ, తాము సాగు చేస్తున్న వ్యవసాయ భూములను మాత్రమే అటవీ భూములుగా మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్మెంట్ భూములను అటవీ భూములుగా నమోదు చేయడం వల్ల రైతుబంధు పథకం ప్రయోజనం అందడం లేదని, ఎరువుల పంపిణీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
అటవీ భూములుగా నమోదైన అసైన్మెంట్ భూములను సాగు చేస్తున్న 40 మంది రైతులకు ఇప్పటికే తిరిగి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారని, మిగిలిన 140 మంది రైతులకు కూడా పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు ఆధ్వర్యంలో బాధిత రైతులు పోకల సాయిరాం, నామాల గంగయ్య, నామాల పోచయ్య, సుప్పాల సాయిలు, చింతల సత్యవ్వ, చింతల సావిత్రి, తాడ్వాయి భూమయ్య, సందీప్ తదితరులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.






