- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమ్స్ మెడికల్ షాపుల అద్దె అక్షరాలా రూ.కోటి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలోని రెండు ప్రైవేట్ మెడికల్ షాపుల అద్దె నెలకు రూ. కోటి పలికింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలోని రెండు ప్రైవేట్ మెడికల్ షాపుల అద్దె నెలకు రూ. కోటి పలికింది. అయితే ఇంత భారీ రెంట్ వెనక అసలు వ్యాపార రహస్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిమ్స్ లోని షాప్ నంబర్-1కు నెలకు రూ. 55 లక్షలు, షాప్ నంబర్-4కు రూ. 45 లక్షల అద్దె పలికినట్లు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు మెడికల్ షాపులకే ఒక సంస్థ ప్రభుత్వానికి నెలకు రూ. కోటి అద్దె చెల్లిస్తున్నది. అయితే జీఎస్టీ, నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు.. ఇలా అన్నీ భరించాలంటే సదరు సంస్థ నెలకు కనీసం రూ. 2 కోట్ల లాభం పొందాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆల్ ఇండియా కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ అసోసియేషన్ (ఏఐసీఓడీ) నిబంధనల ప్రకారం సాధారణ మందులపై వచ్చే ప్రామాణిక మార్జిన్ కేవలం 20 శాతమే. మరి ఇంత తక్కువ మార్జిన్‌తో నెలకు కోట్ల రూపాయల లాభాలు గడించడం ఎలా సాధ్యం? ఈ అద్దె భారాన్ని సదరు సంస్థ రోగుల నుంచే ఎలా రాబడుతోంది అనే కోణంలో ‘దిశ’ జరిపిన లోతైన పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సొంత బ్రాండ్ల దందా!
ఆస్పత్రికి నిత్యం మూడు వేల మందికి పైగా ఓపీ రోగులు వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ఇన్ పేషెంట్లు మందులు కొంటుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ ఫార్మసీలు మాయాజాలం చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్లు రాసిచ్చే ప్రామాణిక కంపెనీల బ్రాండెడ్ మందులను పక్కన పెట్టి, సదరు మెడికల్ షాపులు.. తాము సొంతగా, కొన్ని చిన్న కంపెనీల చేత తయారు చేయించుకునే బ్రాండ్లను రోగులకు అంటగడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైద్యులు రాసిన మందుల కాంబినేషన్ సరిపోలుతుందనే నెపంతో పేషెంట్లకు తాము అనుకున్న సొంత బ్రాండ్లనే విక్రయిస్తూ గరిష్ట ఎంఆర్‌పీల ద్వారా భారీ లాభాలు అర్జిస్తున్నట్లు తెలుస్తున్నది. రోగులు తమకు నచ్చిన లేదా డాక్టర్ రాసిన మందులు కాకుండా, ఫార్మసీలకు నచ్చిన మందులనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్వాలిటీ విషయంలో రాజీ వద్దు
నేరుగా ఆస్పత్రి ఫార్మసీలకే స్టాక్ వస్తుండటంతో వాటి నాణ్యతను తనిఖీ చేసే అవకాశం తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత బ్రాండ్ల మందులు అమ్ముతున్నప్పుడు.. లాభాల కోసం క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కావొద్దని నిమ్స్ అధికారులను నిపుణులు కోరుతున్నారు. మందుల క్వాలిటీ, ధరలపై ప్రత్యేక నిఘా ఉంచి, రోగులకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
టెండర్ల ద్వారా నిమ్స్ ఆస్పత్రికి భారీగా ఆదాయం రావడం సంతోషమే. అయితే ఆదాయం ఎంత ముఖ్యమో.. రోగుల సంక్షేమం కూడా మాకు అంతే ముఖ్యం. ఆస్పత్రి నిబంధనల మేరకు రోగులకు అన్ని రకాల ప్రామాణిక మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఏ ప్రైవేట్ ఫార్మసీ అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, నాణ్యత లేని మందులు విక్రయించినా లేదా మందుల మార్పిడికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం.
-ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్, నిమ్స్ డైరెక్టర్






