ఇంటర్నెట్‌లో బిగ్ ట్విస్ట్.. మానవులను దాటేసిన ఏఐ బాట్స్!

by Javid Pasha |

క్లౌడ్‌ఫ్లేర్ డేటా ప్రకారం.. ఇంటర్నెట్‌లో మానవులకంటే.. ఏఐ బాట్స్ ఎక్కువ రద్దీని సృష్టిస్తున్నాయి.

ఇంటర్నెట్‌లో బిగ్ ట్విస్ట్.. మానవులను దాటేసిన ఏఐ బాట్స్!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఇంటర్నెట్‌పై ఎక్కువసేపు గడపడం, సమాచారం సెర్చ్ చేయడం, కంటెంట్ వీక్షించడం వంటివి మానవులే చేసేవారు. కానీ ఇటీవల ఏఐ చాట్‌బాట్స్ సైతం ఇదే పనిని వేగంగా చేస్తున్నాయి. అంతేకాదు.. ఇవి మానవుల సాధారణ ఇంటర్నెట్ ట్రాఫిక్ కంటే ఎక్కువ రద్దీని సృష్టిస్తున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. కొన్ని రకాల ఏఐ ఏజెంట్లు, ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌లు వెబ్‌లో నిరంతరం సంచరిస్తూ భారీగా డేటాను సేకరిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మానవులకంటే ఏఐ ట్రాఫిక్కే ఎక్కువ!

క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) డేటా ప్రకారం.. చరిత్రలోనే మొదటిసారిగా 2026లో ఇంటర్నెట్‌లో ఏఐ బాట్స్, మానవుల కంటే ఎక్కువ రద్దీని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో ఏఐ బాట్స్ వాటా సుమారు 53-57% వరకు ఉంటే, మానవుల వాటా 47% కంటే తక్కువకు పడిపోయింది. చాట్‌జీపీటీ (ChatGPT), జెమిని (Gemini) వంటి ఏఐ టూల్స్, అలాగే Zapier, n8n లాంటి ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌లు వెబ్‌ను నిరంతరం క్రాల్ చేస్తూ సమాచారాన్ని సేకరించడమే ఈ మార్పునకు ప్రధాన కారణం.

ఎలా పనిచేస్తున్నాయి?

ఏఐ ఏజెంట్లు ఇప్పుడు యూజర్ల తరఫున ఆన్‌లైన్ షాపింగ్, రీసెర్చ్, ప్రాడక్ట్ కంపారిజన్ వంటి పనులను ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తున్నాయి. మనం అడిగే ఒక్క ఏఐ క్వెరీ వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో బాట్ విజిట్స్ జరుగుతుంటాయి. ఫలితంగా.. ఇంతకాలం ‘మానవులే ప్రథమం’ (Human-first)గా ఉన్న ఇంటర్నెట్ నమూనా పూర్తిగా మారిపోతోంది. దీనివల్ల వెబ్‌సైట్ అనలిటిక్స్ డేటాపై నమ్మకం తగ్గుతోందని, వ్యాపార సంస్థలు అసలైన వినియోగదారులకు కాకుండా బాట్ క్లిక్స్‌కే తమ మార్కెటింగ్ బడ్జెట్‌ను చెల్లించాల్సి వస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఏఐ ఏజెంట్ ఎకానమీ’ ఇంటర్నెట్‌కు అతిపెద్ద వినియోగదారుగా మారుతోంది. రాబోయే దశాబ్దంలో ఏఐ బాట్స్‌కు అనుకూలంగా ఉండే వెబ్‌సైట్లకే డిమాండ్ పెరుగుతుందని కొందరు భావిస్తుంటే, ఇది డిజిటల్ వ్యవస్థకు కొత్త సవాలుగా మారవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Next Story