మంచిర్యాల ఎమ్మెల్యే హద్దులు దాటద్దని హెచ్చరించిన కేటీఆర్

by Batti.Sumithra |

రైతులు సచ్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

మంచిర్యాల ఎమ్మెల్యే హద్దులు దాటద్దని హెచ్చరించిన కేటీఆర్
X

దిశ, లక్షేట్టిపేట : రైతులు సచ్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం మండలంలోని అంకత్ పల్లిలో వాసవి గార్డెన్స్ లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాల అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. వర్షానికి గోడ కూలీ మరణిస్తే నేటికీ ఆ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందలేదని విమర్శించారు. చివరికి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు భీమా ద్వారా మాత్రమే ఒక రైతు కుటుంబానికే రూ. 5 లక్షలు సాయం అందిందన్నారు. మిగిలిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సచ్చిపోతున్న రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. 32 నెలలు దాటిన కూడా ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు న్యాయం చేయడం లేదని, కాళేశ్వరం రిపేర్ పనులు ఎందుకు చేయడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చిన వారికి సాగునీటి విలువ ఎలా తెలుస్తుందని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులను మోసం చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రేవంత్ దొరికితే ఉరికిచ్చి కొడుతారన్నారు. నిరుద్యోగులను ఎండ్రిన్ తాగుమని ఎలా అంటావ్ రేవంత్ అని మండిపడ్డారు. మాది ఏ జాతి అని ప్రశ్నించే రేవంత్ కు మేమిచ్చే సమాధానం ఒక్కటే, మాది తెలంగాణను ప్రేమించే జాతి అని స్పష్టం చేశారు. ఉద్యమ కారుల పై తుపాకీ ఎక్కుపెట్టిన జాతి నీది రేవంత్ దేనని, ఎమ్మెల్యేను నోట్లతో కొనే జాతి రేవంత్ దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించారు.

రైతుల పంటలను కొనుగోలు చేయరు, గిట్టుబాటు ధర ఇవ్వరు, యూరియా కోసం అనేక కష్టాలను రైతులు పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అని ప్రసంగించారు. అంతకుముందు వర్షానికి అకాల మరణం చెందిన దండేపల్లి, లక్షేట్టిపేట మండలాలకు చెందిన రైతు కుటుంబాలకు పార్టీ తరపున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులను సహించేది లేదని, ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజాసంక్షేమం గురించి మీ ముఖ్యమంత్రిని అడిగి అభివృద్ధి పనులు చేయండి, అనవసరంగా మా పార్టీ నాయకుల, కార్యకర్తల జోలికి రావద్దని కేటీఆర్ హెచ్చరించారు. అంతకు ముందు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుల పై కక్ష సాధింపు పనులు మానుకుని, రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చెప్పినట్టు వినడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పక్షపాతం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మరణిస్తే ఎమ్మెల్యే మాటలు విని కలెక్టర్ సంఘటనా స్థలానికి రాలేదని ఆరోపించారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతారని, ప్రజలకు మేలుజరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవలక్ష్మీ, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సుంకే రవి, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, మాజీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story