ఆరోపణల అధికారి చేతికి మరో బాధ్యత.. జలసౌధలో పోస్టింగ్‌లపై కొత్త వివాదం

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతల కేటాయింపులో పారదర్శకత ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, నీటి పారుదల శాఖ జలసౌధలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆరోపణల అధికారి చేతికి మరో బాధ్యత.. జలసౌధలో పోస్టింగ్‌లపై కొత్త వివాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతల కేటాయింపులో పారదర్శకత ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, నీటి పారుదల శాఖ జలసౌధలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి మరో కీలక బాధ్యతను సైతం అప్పగించడం ప్రస్తుతం శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. జడ్చర్ల సబ్‌డివిజన్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ అధికారికి తాజాగా చింతలపల్లి సబ్‌డివిజన్ అదనపు బాధ్యతలను సైతం అప్పగించడం వెనుక ఉన్న కారణాలపై ఉద్యోగ వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖలో అందుబాటులో అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ.. చింతలపల్లి సబ్‌డివిజన్ పోస్టును రెగ్యులర్ పోస్టింగ్ ద్వారా భర్తీ చేయకుండా కావాలనే ఖాళీగా ఉంచారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముందుగానే ఈ పోస్టును బ్లాక్ చేసి, ఆ తర్వాత ఈ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించేలా ప్రణాళిక ప్రకారం వ్యవహరించారనే చర్చ జరుగుతున్నది. ఇందులో ప్రధానంగా ఈఎన్సీ, డిప్యూటీ ఈఎన్సీ, సీఈలు చక్రం తిప్పారన్న వాదన వినిపిస్తున్నది.

మంత్రి మరోసారి హెచ్చరించినా మారని తీరు..

జడ్చర్లలో డ్యూటీ చేస్తున్న ఆ అధికారిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అక్కడ కాకుండా నిత్యం జలసౌధలోనే ఉంటూ పనులు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా.. ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్ విషయంలోనూ ఆయనదే హవా నడుస్తున్నదన్న ప్రచారం ఉన్నది. ఇదే అంశంపై పలు ఫిర్యాదులు వెళ్లగా ఇప్పటికే మంత్రి సైతం ఆయనను హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మళ్లీ జలసౌధలోనే ఉంటూ ఉన్నతాధికారుల వద్ద పాలిటిక్స్ నడిపించడం చేస్తుండేవారని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఇదే అంశాన్ని ఇటీవల ‘దిశ’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. డిప్యూటీ ఈఈ హోదాలో ఉన్న ఆయన తనకు కేటాయించిన ప్లేసులో విధులు నిర్వర్తించకుండా.. జలసౌధలోనే నిత్యం ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల అంశాల్లో తలదూర్చుతున్నారని కథనం ప్రచురించింది. అయితే.. ఈ కథనాన్ని సైతం మంత్రి సీరియస్‌గా తీసుకోని సదరు అధికారికి మరోసారి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. ఆ తరువాత సైతం రెండు, మూడు సందర్భాల్లో జలసౌధకు వచ్చారని సమాచారం.

అందుకోసమే హైడ్రామా..

ఇప్పటికే జలసౌధలో ఉంటూ జడ్చర్ల క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చూసుకోకుండా అన్నింటిలోనూ తలదూర్చుతున్నారన్న ఆరోపణలు ఉన్న అధికారికే మరో సబ్ డివిజన్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. చింతలపల్లి సబ్ డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలను సైతం ఆయనకే అప్పగించారని తెలిసింది. అయితే.. ఉద్యోగుల వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎన్సీ, డిప్యూటీ ఈఎన్సీ, సీఈ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో అక్కడికి ఎవరో ఒకరు అధికారిని పంపించే అవకాశం ఉన్నది. కానీ, ఉన్నతాధికారులు కావాలనే ఆ పోస్టును ముందుగానే బ్లాక్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఈ అధికారి కోసమే బ్లాక్ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారని సమాచారం. బదిలీలపై బ్యాన్ ఎత్తేయడానికి రెండు నెలల ముందే ఈ తతంగం అంతా జరిపినట్లు తెలిసింది. డివిజన్ నంబర్ 4 కింద ఉన్న చింతలపల్లికి అదనపు బాధ్యతల కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి జలసౌధలోని ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ పెట్టుకోవడంతో ఇదంతా ఎవరికీ తెలియకుండా పని పూర్తిచేశారని తెలిసింది. దీంతో ఇక ఆయన జడ్చర్లకు వెళ్లడమే మానేశారని తెలిసింది. సాధారణ పరిపాలనా విధానాలకు భిన్నంగా ఒకే అధికారికి వరుసగా అదనపు బాధ్యతలు అప్పగించడానికి కారణాలేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు.. హైదరాబాద్ పరిధిలోని సబ్ డివిజన్‌లోనే ఇన్‌చార్జి బాధ్యతలు ఉంటే నిత్యం జలసౌధకు వచ్చి తన పనిని చక్కబెట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే ఉన్నతాధికారులను మచ్చికచేసుకొని పోస్టింగ్ ఇప్పించుకున్నారన్న చర్చ నడుస్తున్నది.

సంఘం ముసుగులో..

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి ఓ సంఘానికి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సంఘం ముసుగులో జలసౌధలో చక్రం తిప్పుతున్న ఆ అధికారి పోస్టింగ్‌ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సంఘ నాయకుడిగా ఉంటూనే అధికారిక నిర్ణయాలపై ప్రభావం చూపుతూ, ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలి? ఎవరికి అదనపు బాధ్యతలు కట్టబెట్టాలనే అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన సిఫార్సులు లేకుండా ముఖ్యమైన ఫైళ్లు ముందుకు కదలడం లేదనే ప్రచారం కూడా శాఖలో జోరుగా సాగుతున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే చింతలపల్లి అదనపు బాధ్యతలు అప్పగించడానికి అనుసరించిన ప్రమాణాలేమిటి? ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర ఏంటి? అనే డిస్కషన్ శాఖలో జోరుగా సాగుతున్నది.

Next Story