- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ల కింద అర్బన్ హబ్స్
హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద ఖాళీ స్థలాల రూపాంతరం.. ఓపెన్ జిమ్‌లు, ఈవీ ఛార్జింగ్, ఫుడ్ కోర్టులతో అర్బన్ హబ్‌లుగా మార్చనున్న హెచ్‌ఎమ్‌డీఏ!

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వీటి కింద ఉన్న ఖాళీ స్థలాలు చాలాచోట్ల అనధికారిక పార్కింగ్‌కు, చెత్త డంపింగ్‌కు, ఆక్రమణలకు, అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) పరిధిలోని ఈ వృథా స్థలాలను అద్భుతమైన పబ్లిక్ ప్లేసెస్‌గా మార్చేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోపాలిటన్ యూనిఫైడ్ ట్రాన్స్ ఫోర్ట్ ఆథారిటీ(ఉమ్టా) అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ అర్బన్ ప్లానర్లతో వినూత్మకమైన డిజైన్లతో నివేదిక తయారు చేయడానికి కసరత్తు చేస్తోంది.
వ్యాపార కేంద్రాలుగా..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు అర్బన్ హబ్‌లుగా మార్చేందుకు హెచ్ఎండీఏ చర్యలు ప్రారంభించింది. ప్రజల ఆరోగ్యం, క్రీడా సదుపాయాల్లో భాగంగా ఓపెన్ జిమ్‌లు, క్రీడా మైదానాలు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, అందమైన పార్కులు (గార్డెన్స్)గా మార్చాలని నిర్ణయించారు. వీటితోపాటు పబ్లిక్ టాయిలెట్లు, ప్రాథమిక వైద్యం అందించే మొహల్లా క్లినిక్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. వ్యాపార కేంద్రాలుగా మార్చడంతో పాటు ఆదాయాన్ని రాబట్టుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫుడ్ కోర్టులు, షాపింగ్ కియోస్క్‌లు, మల్టీ-స్క్రీన్ డిజిటల్ డిస్‌ప్లేలు (ప్రకటనల కోసం) ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో ‘పే అండ్ పార్క్’ విధానంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
యాక్షన్ ప్లాన్ ఇలా..
ముందుగా నగరంలో తక్షణమే అభివృద్ధి చేయడానికి వీలున్న కీలకమైన ఫ్లైఓవర్లను ఎంపిక చేసి స్థానిక ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను సేకరించి, అక్కడి అవసరాలపై అధికారులు సర్వే చేయనున్నారు. జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా లొకేషన్ల పూర్తి సమాచారంతో డిజిటల్ డేటాబేస్‌ను తయారు చేయనున్నారు. ఒక్కో ఏరియాలో ఒక్కో థీమ్‌ను ఎంపిక చేసి.. తక్కువ ఖర్చుతో, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్థలాల గుర్తింపు తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను తయారు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీని నియమించాలని భావిస్తున్నారు. డీపీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా చేయాలా? అనే అంశాన్ని నిర్ణయించి పనులు ప్రారంభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.






