విరిగిపడిన కొండ చరియలు.. కుటుంబం సజీవ సమాధి

by Naga Rani Yarlagadda |

జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ ప్రాంతాన్ని ప్రకృతి విపత్తు వణికిస్తోంది. కొండచరియలు విరిగిపడి ఏడుగురు సజీవ సమాధి అయ్యారు.

విరిగిపడిన కొండ చరియలు.. కుటుంబం సజీవ సమాధి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ ప్రాంతాన్ని ప్రకృతి విపత్తు వణికిస్తోంది. పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఆదివారం సంభవించిన ఆకస్మిక వరదల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం మరవక ముందే, సోమవారం పూంచ్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని లోరన్ ప్రాంత ఎగువన ఉన్న లోపడి గ్రామంలో భారీగా కొండచరియలు విరిగిపడి ఒక మట్టి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు సజీవ సమాధి అయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్‌లు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను జైదా బేగం (35), ఆమె ఇద్దరు చిన్నారులు అద్నాన్ రఫీక్ (4), ఇర్జా (2)లతో పాటు షమీమ్ అక్తర్, తన్వీర్ (22), ఇర్ఫాన్ (22), సబీనా (30)లుగా అధికారులు గుర్తించారు. మిగిలిన వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆదివారం వరదల్లో 17 మంది మృతి.. ఇంకా ఆరుగురు గల్లంతు

కాగా, అంతకుముందు రోజే (ఆదివారం) కురిసిన భారీ వర్షాలకు పూంచ్, రాజౌరి జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు 17 మందిని బలితీసుకున్నాయి. ఇందులో ఒక్క లోరన్ ప్రాంతంలోనే ఏడుగురు మరణించగా, మరో ఆరుగురు ఇప్పటికీ గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్‌లో వరద తీవ్రత అత్యధికంగా ఉంది. ఎడతెరిపి లేని వర్షాలు, దెబ్బతిన్న రహదారుల కారణంగా గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలకు తెగించి గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

రూ. 6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ తరఫున ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దారుణ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. SDRF నుంచి రూ.4 లక్షలు, CMRF నుంచి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు.

Next Story