గోదావరి జలాలకై రగిలిన పాకాల రైతాంగం

by Kodari Anjali |   (  Updated:2026-07-20 13:02:16  IST  )

ఆదివారం నర్సంపేటలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు.

గోదావరి జలాలకై రగిలిన పాకాల రైతాంగం
X

దిశ, ఖానాపురం: ఆదివారం నర్సంపేటలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఖానాపురంలో సోమవారం అఖిల పక్షం కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహించి రైతులను ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు . కానీ బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో రైతులు కొందరు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా పాకాలలో ప్రస్తుతం 14 ఫీట్లు నీళ్లు ఉన్నాయి. పాకాల సామర్థ్యం 3 టీఎంసీ లు కాగా ఇప్పుడు 0.8 టీఎంసీ లు ఉన్నాయి.దీనిలో డెడ్ స్టోరేజ్ 0.5 టీఎంసీ లుగా ఉంది. దీనితో ఆరుతడి పంటలు తప్పితే వరి పంట సాగు చేసే పరిస్థితి లేదన్నది అధికారులు చెబుతున్న మాట. వర్షాలు పడితే తప్పితే వరి సాగు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం “మా కళ్లముందే నారుమడులు ఎండిపోతున్నాయి. మొన్నటి వరకు నారు మళ్ల కోసం వడ్లు కొనమన్నారు. ఇప్పుడు పంటలు వేయొద్దంటున్నారు. మా పెట్టుబడులు ఎవరు తిరిగి ఇస్తారు…? మా కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు…?” ఈ మాటలు ఒకరివి కావు… ఖానాపురం మండలంలోని పాకాల ఆయకట్టు రైతుల హృదయవేదన. కాకతీయుల కాలంలో క్రీ.శ. 1213లో గణపతిదేవుడు నిర్మించిన చారిత్రాత్మక పాకాల సరస్సు, ఒకప్పుడు వేలాది ఎకరాలకు జీవనాధారంగా నిలిచింది. అధికారిక రికార్డుల ప్రకారం 18,193 నుంచి 22,410 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించిన ఈ సరస్సు, దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రామప్ప–పాకాల గోదావరి జలాల అనుసంధానం అనంతరం ప్రస్తుతం దాదాపు 30 వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరందించే స్థాయికి చేరుకుంది.

అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి..

ఖానాపురం మండలంతో పాటు సుమారు 40 గ్రామాల రైతుల జీవనాడిగా పాకాల సరస్సు నిలిచింది. వరంగల్ జిల్లాలోనే ప్రధాన ధాన్యాగారంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ప్రతి ఖరీఫ్‌, యాసంగి సీజన్‌లలో వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. నీటి లభ్యత తగ్గినప్పుడు మాత్రమే రైతులు మొక్కజొన్న, పత్తి, మిరప, కంది, పెసర వంటి ప్రత్యామ్నాయ పంటలను ఆశ్రయిస్తారు. కానీ ఈ ప్రాంత రైతు గుండె చప్పుడు మాత్రం వరి పంటే. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. వర్షాలు ముఖం చాటేయడంతో పాటు పాకాల సరస్సు నుంచి సాగునీటి విడుదలలో జాప్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి, నారు మడులు సిద్ధం చేసిన రైతులు ఇప్పుడు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. “నారు పోయమన్నారు. ఇప్పుడు నాట్లు వేయొద్దంటున్నారు” అంటూ సోమవారం ఖానాపురం రైతు వేదికలో జరిగిన సమావేశంలో రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులను రైతులు నిలదీశారు. “ప్రభుత్వమే నారు మళ్ల కోసం వడ్లు కొనమంది.. వ్యవసాయ శాఖే నారు పోసుకోమంది… ఇప్పుడు నీళ్లు లేవని, నాట్లు వేయవద్దని చెబుతున్నారు. రైతుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాకాల తూములను వెంటనే తెరిచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ముందే హెచ్చరించిన రైతులు… పాకాల గేట్ల వద్ద ఆందోళన

కొద్ది రోజుల క్రితం కూడా పాకాల సరస్సు ప్రధాన గేట్ల వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు. ఖానాపురం నుంచి వందలాది మంది రైతులు, పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా పాకాల వరకు చేరుకుని, నారుమడులను కాపాడేందుకు వెంటనే తూములు ఎత్తాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల ప్రకారం, పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ రైతులు గేట్ల వరకు చేరుకుని తూములను తెరిచారు. ఈ ఘటనలో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పార్టీ ఆరోపించింది.

రాజకీయ ఆరోపణలు...

సమావేశంలో కొందరు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో దేవాదుల జలాలు అందిస్తామని చెప్పి, ఇప్పుడు నీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదని వారు విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చొరవతో రామప్ప–పాకాల లింక్ పూర్తై గోదావరి జలాలు పాకాలకు చేరాయని, ప్రస్తుతం ఆ నీటిని రైతులకు సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ప్రతి చుక్క నీరు… ఒక రైతు కన్నీటి బొట్టు

పాకాల ఆయకట్టు కింద సాగు చేసే రైతుల్లో చాలామంది అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. నారు మడులు ఎండిపోతే మళ్లీ విత్తనాలు కొనాలి. మళ్లీ కూలీల ఖర్చు పెట్టాలి. మళ్లీ భూమిని సిద్ధం చేయాలి. ఒకసారి పంట దెబ్బతింటే కుటుంబం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి. “మాకు రాజకీయాలు అవసరం లేదు… నీళ్లు కావాలి. మా నారుమళ్లను కాపాడండి… మా పిల్లల భవిష్యత్తును కాపాడండి… రైతు బతికితేనే దేశం బతుకుతుంది” అంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. చారిత్రాత్మక పాకాల సరస్సు నీటితో ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన వేలాది ఎకరాల పొలాలు… నేడు రైతుల ఆందోళనలకు వేదికగా మారడం బాధాకరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి పాకాల-రంగాయ చెరువు మోటార్లను ఆన్ చేసి పాకాలలో గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ సరస్సును నింపి తూములను తెరిచి సాగునీటిని విడుదల చేయకపోతే, ఈ ఖరీఫ్ సీజన్‌లో వేలాది ఎకరాల వరి పంటతో పాటు వేలాది రైతు కుటుంబాల ఆశలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్డీఓ ఉమారాణి, ఐబీ అధికారులు సుదర్శన్, రమేష్ , తహసీల్దార్ రమేష్ , పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story