HYD: ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. రెండు రోజులు బల్కంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

by Ramesh Naini |

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

HYD: ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. రెండు రోజులు బల్కంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, రథోత్సవం సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో (మంగళ, బుధవారాలు) బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జాతరకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు కింది ప్రత్యామ్నాయ మార్గాలను గమనించాలని సూచించారు.

ప్రధాన మళ్లింపులు ఇవే..

ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి ఆలయం వైపునకు, అలాగే బేగంపేట కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట వైపునకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలను అనుమతించరు. ఎస్సార్‌ నగర్ ‘T’ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న లింక్ రోడ్లను పూర్తిగా మూసివేస్తారు. గ్రీన్‌ల్యాండ్స్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్సార్‌ నగర్ ‘T’ జంక్షన్ వద్ద బి.కె.గూడ మీదుగా మళ్లిస్తారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ (RUB) ద్వారా బేగంపేట వైపు మళ్లిస్తారు. బేగంపేట నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బేగంపేట ఫ్లైఓవర్, సత్యం థియేటర్ మీదుగా గ్రీన్‌ల్యాండ్స్ వైపు అనుమతిస్తారు. బకుల్ అపార్ట్‌మెంట్స్ - ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే వాహనాలను సోనాబాయి టెంపుల్ మీదుగా మైత్రీవనం వైపు మళ్లిస్తారు.

భక్తుల కోసం 6 పార్కింగ్ స్థలాలు..

ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్ (డీకే రోడ్), ఫతేనగర్ అండర్ బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సనత్‌నగర్ జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story