సీలింగ్ ఫ్యాన్ పడి పేషెంట్ మృతి.. ఢిల్లీలోని గురుతేగ్ బహదూర్ ఆస్పత్రిలో ఘటన..

by I. Sairam |

ఢిల్లీలోని గురుతేగ్ బహదూర్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.

సీలింగ్ ఫ్యాన్ పడి పేషెంట్ మృతి.. ఢిల్లీలోని గురుతేగ్ బహదూర్ ఆస్పత్రిలో ఘటన..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రిలో చేరితే అక్కడ జరిగిన ఓ ప్రమాదం వల్ల ఓ పేషెంట్ ప్రాణాలే పోయాయి. ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈస్ట్ ఢిల్లీకి చెందిన మహమ్మద్ అక్బర్ (42) తీవ్రమైన న్యుమోనియా, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో గత శుక్రవారం చేరాడు. అయితే శనివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి అతడిపై పడింది. దీంతో అతడికి పొత్తి కడుపు భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతడి పక్కనే ఉన్న మేల్ నర్సుకు కూడా గాయాలు అయ్యాయి. వెంటనే సదరు పేషెంట్‌కు ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 12.16 గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించి మరణించారు. కానీ అతడి డెత్ సర్టిఫికెట్‌లో ఫ్యాన్ ఊడి పడటం వల్ల జరిగిన గాయాలతో మరణం సంభవించలేదని, గత అనారోగ్య కారణాలతో చనిపోయాడని ఆస్పత్రి పేర్కొంది. అయితే ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాల నిర్వహణ లోపించడం, రోగుల భద్రతను గాలికొదిలేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు, ఇతర రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ప్రమాదం అనంతరం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది వచ్చి ఆ ఫ్యాన్‌ను రిపేర్ చేశారు.

Next Story