సూరారంలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

by Batti.Sumithra |

ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.

సూరారంలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
X

దిశ, ఎల్కతుర్తి : ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఉదయం సుమారు 4.30 నుంచి 5 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లిన గ్రామస్తులు ఎలుగుబంటిని గుర్తించి భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామానికి సమీపంలో ఉన్న నర్సరీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాల కేంద్రం వద్దకు వచ్చిన పలువురు గ్రామస్తులు కూడా ఎలుగుబంటిని చూసినట్లు తెలిపారు. దీంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం తీవ్ర ఎండల కారణంగా చాలామంది గ్రామస్తులు రాత్రి వేళ ఇళ్ల ముందు నిద్రిస్తున్నారు.

అలాగే ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ఎలుగుబంటి సంచారం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామంలో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందో తెలియక ప్రజలు బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని గుర్తించి సురక్షితంగా అడవిలోకి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే గ్రామంలో రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్‌ను పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలుగుబంటి సంచారంతో సూరారం గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.

Next Story