- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల బాత్రూమ్ పనులపై రాజకీయ కుట్రలు తగవు
గ్రామంలో ప్రస్తుత పాలకవర్గం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కొందరు కావాలనే పాఠశాల విద్యార్థుల బాత్రూమ్ నిర్మాణ పనులకు అడ్డుపడుతున్నారని దేవాయిపల్లి గ్రామ సర్పంచ్ నరేష్ తీవ్రంగా ఆరోపించారు.

దిశ, తాడ్వాయి: గ్రామంలో ప్రస్తుత పాలకవర్గం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కొందరు కావాలనే పాఠశాల విద్యార్థుల బాత్రూమ్ నిర్మాణ పనులకు అడ్డుపడుతున్నారని దేవాయిపల్లి గ్రామ సర్పంచ్ నరేష్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం దేవాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వార్డు సభ్యులు, గ్రామస్థులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాస్తవాలను వెల్లడించారు. గత పాలకవర్గం పాఠశాలకు కేటాయించిన స్థలంలోనే గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించిందని సర్పంచ్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పిల్లల ఆటస్థలానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన బాత్రూమ్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
వారి విజ్ఞప్తి మేరకే ఈ నిర్మాణాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ ఆవరణ చుట్టూ ఏర్పాటు చేసిన జాలి ఫెన్సింగ్ లోపల ఉన్న స్థలంలోనే విద్యార్థుల కోసం బాత్రూమ్ నిర్మిస్తున్నామని, ఇందులో ఎలాంటి స్థల కబ్జా జరగలేదని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొందరు ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని సర్పంచ్ మండిపడ్డారు. పల్లె ప్రకృతి వనంలో దాదాపు 300 చెట్లను తొలగించారంటూ అధికారులను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనం పక్కనే అంగన్‌వాడీ కేంద్రం ఉందని, అక్కడ ఆడుకుంటున్న చిన్నారుల వద్దకు తరచూ విషసర్పాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. పిల్లల భద్రత, స్థానికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని వారి ఫిర్యాదు మేరకే పాలకవర్గం తీర్మానం చేసి కేవలం 50 నుంచి 60 వరకు ఉన్న చిన్న చెట్లు, పొదలు, పిచ్చిమొక్కలను మాత్రమే తొలగించిందని వివరించారు.
అడ్డుకుంటే కలెక్టరేట్ ముట్టడికి సిద్ధం
బాత్రూమ్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి సర్పంచ్‌గా తనకు గానీ, పంచాయతీ కార్యదర్శికి గానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని నరేష్ తెలిపారు. గ్రామస్థులు, పాలకవర్గం సహకారంతోనే పిల్లల సౌకర్యార్థం ఈ పనులు చేపడుతున్నామని, ఇందులో ఎలాంటి స్వార్థం లేదన్నారు. రాజకీయ కక్షలతో పిల్లల అవసరాలకు అడ్డుపడితే సహించబోమని హెచ్చరించారు. ఒకవేళ పనులను అడ్డుకుంటే గ్రామస్థులందరూ కలిసి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు, అవసరమైతే అక్కడే ధర్నాకు దిగేందుకూ సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ నరేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






