థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు.. ఈగల్ టీమ్ దెబ్బకు ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు

by Prasad Jukanti |

థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను తెలంగాణ ఈగిల్ ఫోర్స్ చేదించింది.

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు.. ఈగల్ టీమ్ దెబ్బకు ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గంజాయి స్మగ్లింగ్ ముఠాపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ పంజా విసిరింది. అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను చేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి వద్ద గంజాయి స్వాధీనం చేసుకుని పోలీసులు, కస్టమ్స్ అధికారులు సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. థాయ్‌లాండ్, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా భారీ నెట్‌వర్క్‌ను నడిపిస్తూ సుమారు 300 మంది క్యారియర్లను ఉపయోగించి థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు హైడ్రోపోనిక్ గంజాయిని తరలించినట్లు ఈగిల్ ఫోర్స్ గుర్తించింది.

రూటు మార్చి మాదకద్రవ్యాల రవాణ:

థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఈ ముఠా గతంలో అరుదైన వస్తువుల స్మగ్లింగ్‌ లో పాల్గొనేదని పోలీసులు తెలిపారు. అయితే 2023 నుంచి రూట్ మార్చిన ఈ గ్యాంగ్ అప్పటి నుంచి వస్తువుల స్మగ్లింగ్ స్థానంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దృష్టి సారించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 2026 ఏప్రిల్ 8న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన సోధా మొహసన్ బహదూర్ భాయ్ అనే ప్రయాణికుడి వద్ద 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ముంబై–హైదరాబాద్–థాయ్‌లాండ్ నెట్‌వర్క్:

సోధా మొహసన్ బహదూర్ భాయ్ అరెస్టు అనంతరం రాచకొండ పోలీసులు, కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో హరషద్ మన్‌సుఖ్ భాయ్ ప్రజాపతి, సందీప్ వాసాని అలియాస్ రాహుల్ జైన్‌లను అరెస్ట్ చేసి మరో 12.739 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఈ ముఠా థాయ్‌లాండ్, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా భారీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు బయటపడింది. గుజరాత్‌కు చెందిన దల్ అబ్దుల్లా సదుద్దీన్ నాయ్ అనే వ్యక్తి యువకులను ప్రలోభపెట్టి థాయ్‌లాండ్ నుంచి గంజాయి రవాణా చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో NDPS చట్టంలోని పలు సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 40 మంది నిందితులను గుర్తించారు. వీరిలో పలువురు అరెస్టు కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ముంబైకి చెందిన హేమంగ్ ప్రమోద్ కెలుస్కర్ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడు, అతని సోదరుడు సుధాంశు కెలుస్కర్ థాయ్‌లాండ్‌లో క్లబ్ వ్యాపారం నిర్వహిస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు కేంద్రంగా ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ స్మగ్లింగ్‍లో కస్టమ్స్ నిఘా నుంచి తప్పించుకోవడానికి వివిధ విమానాశ్రయాలను మారుస్తూ అక్రమ రవాణా కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

యువతకు ఈగిల్ ఫోర్స్ హెచ్చరిక:

గంజాయి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరమని ఈగిల్ ఫోర్స్ హెచ్చరించింది. యువత డ్రగ్స్, హానికర ఇంజెక్షన్లు, నియంత్రణలేని సప్లిమెంట్లకు దూరంగా ఉండాలని సూచించింది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1908 నంబర్ లేదా ఈగిల్ ఫోర్స్ అధికారిక మార్గాల ద్వారా అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Next Story