- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా దాడి.. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై ఇరాన్ ప్రతిదాడులు
అమెరికా దళాలు ఇరాన్ పై దాడి చేసింది. దీంతో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా తీవ్ర దాడులకు దిగింది.

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులలో ఇద్దరు యూఎస్ సైనికులు మరణించడం, మరొకరు అదృశ్యం కావడంతో యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వరుసగా ఎనిమిదో రోజు రాత్రి ఇరాన్ నగరాలపై విమాన దాడులు నిర్వహించింది. నిర్మాణంలో ఉన్న దార్ఖోవిన్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా దాడులు చేపట్టింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై విరుచుకుపడింది.
ఇరాన్ భీకర దాడులు..
అమెరికా దాడులకు స్పందిస్తూ ఇరాన్ భీకరదాడులకు దిగింది. ఆదివారం పలు విడతలుగా జరిపిన దాడులలో కువైట్‌లోని ఒక విద్యుత్, డీసాలినేషన్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలాగే జోర్డాన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై తీవ్రమైన దాడులు చేసినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. క్యాంప్ అల్-అదీరీలోని అమెరికా ఆయుధ డిపోను, అలీ అల్ సలేమ్ ఎయిర్‌బేస్‌లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లపై దాడులు చేశామని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తిప్పికొట్టాయని కువైట్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు బహ్రెయిన్ కూడా క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకున్నట్లు తెలిపింది. అలాగే తమ భూభాగం వైపు వచ్చిన నాలుగు ఇరాన్ క్షిపణులలో మూడింటిని కూల్చివేసినట్లు జోర్డాన్ స్పష్టం చేసింది. అమెరికా సైనిక స్థావరాలకు ఆతిథ్యమిస్తున్న ఈ మూడు దేశాలు, తాత్కాలిక సీజ్‌ఫైర్ ఒప్పందం భగ్నమైనప్పటి నుండి ఇరాన్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్నాయి.
దార్ఖోవిన్ అణు కేంద్రంపై దాడి.. ఇరాన్ ఆగ్రహం
జోర్డాన్‌లో ఇద్దరు అమెరికా సైనికుల మరణానికి కారణమైన ఐఆర్‌జీసీ బలగాలను శిక్షించడమే లక్ష్యంగా యూఎస్ దార్ఖోవిన్ అణు కేంద్రంపై దాడికి దిగింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును తగ్గించడం కూడా ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా సైన్యం తెలిపింది. కాగా.. నైరుతి ఇరాన్‌లోని నూతనంగా నిర్మిస్తున్న దార్ఖోవిన్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ అణు ఇంధన సంస్థ ధృవీకరించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ ఈ దాడిని ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన ప్రమాదకరమైన దాడిగా అభివర్ణించారు. తమ జాతీయ భద్రతను కాపాడుకోవడానికి తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు.
గల్ఫ్ దేశాల నిరసన..
పౌర, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడాన్ని కువైట్ తీవ్రంగా తప్పుపట్టింది. వరుసగా రెండో రోజు విద్యుత్, డీసాలినేషన్ ప్లాంట్‌పై దాడి జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడులను కతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), లెబనాన్ తీవ్రంగా ఖండించాయి. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకుని తాత్కాలిక సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని అమలు చేయాలని కతార్ ప్రధాని విజ్ఞప్తి చేశారు. తమ భూభాగంపై అకారణంగా దాడులు జరపడాన్ని నిరసిస్తూ జోర్డాన్ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
10 రోజుల యుద్ధ విరమణ ప్రతిపాదన
అమెరికాతో జరుగుతున్న యుద్ధ తీవ్రతను తగ్గించేందుకు, గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని పునరుద్ధరించే మార్గాలను అన్వేషించేందుకు మధ్యవర్తులు 10 రోజుల యుద్ధ విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదనను ఇరాన్‌కు అందించారు. ఈ విరామంలో ఇరాన్ అణు ప్రోగ్రాం, ఇరాన్‌కు నిలిపివేసిన నిధుల విడుదల, పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థాపన కోసం తదుపరి 60 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఇందులో ప్రతిపాదించారు.






