నీట్, ప్రజా సమస్యలపై చర్చకు కేంద్రం సిద్ధం: ఎంపీ రఘునందన్ రావు

by Prasad Jukanti |   (  Updated:2026-07-21 06:24:32  IST  )

పార్లమెంట్‍లో విపక్షాలు చేస్తున్న ఆందోళనపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. అయోధ్య రామమందిర విరాళాలకు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

నీట్, ప్రజా సమస్యలపై చర్చకు కేంద్రం సిద్ధం: ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిబంధనల ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి తప్ప విపక్షాల ఆలోచనకు అనుగుణంగా జరగవని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) అన్నారు. జంతర్ మంతర్‍లో ధర్నాలకు వెళ్లి ఫోటోలు దిగడం కోసమే విపక్ష సభ్యులు ఆందోళనలు చేసి సభను వాయిదా వేయిస్తున్నాయని ఆరోపించారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. నీట్, ప్రజా సమస్యలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నీట్ లీక్ బాధాకరం అని ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. నీట్‍పై సమగ్ర సమాధానం ఇస్తామన్నారు. గతంలో జరిగిన పేపర్ లీక్‍లపై ఎవరైనా రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆలోచన అదే:

నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించామని పరీక్ష ఫలితాలు కూడా వెలువడ్డాయన్నారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిస్తే ఏ ప్రభుత్వమైనా నిరసనకారులను పార్లమెంట్ వరకు రానిస్తుందా అని ప్రశ్నించారు. నిరసనకారులను పార్లమెంట్ వరకు రానివ్వకుండా ఆపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. నీట్ అంశంపై చర్చించడానికి స్పీకర్ అంగీకరించినా ఇప్పుడే చర్చ జరగాలని, జీరో అవర్ రద్దు చేసి చర్చపెట్టాలని అడగడం ఏంటని నిలదీశారు.

బీజేపీకి ఏం సంబంధం:

అయోధ్య విరాళాల చోరీతో బీజేపీకి సంబంధం లేదని ఈ చోరీ కేసుపై సిట్ సమగ్రంగా విచారణ చేస్తోందన్నారు. గుడిలో పని చేస్తున్న ఓ వ్యక్తి దురాశతో చేసిన పనికి దానిని బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు ఆపాదించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రతి సంస్థలో మంచి వారు చెడ్డవారు ఉండారని ఎవరో ఒకరిద్దరు చేసిన పనిని పార్టీకి ఆపాదించడం ఏంటన్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు ఉన్నాయని అందువల్లే ఆ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రామ మందిరం నిర్మించిన బీజేపీపై విపక్షాలు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తోందన్నారు.

Next Story