రాహుల్ గాంధీతో జితేంద్ర సింగ్ చర్చలు.. కేంద్రం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు

by Kema Shiva Kumar |

నీట్ అక్రమాలు, విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ప్రధాని మోదీ నివాసం ఎదుట రాహుల్ గాంధీ చేతులకు సంకెళ్లతో బైఠాయించిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీతో జితేంద్ర సింగ్ చర్చలు.. కేంద్రం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలు, శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ.. విపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇవాళ భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట బైఠాయించి వినూత్నంగా నిరసన తెలిపారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా రాహుల్ గాంధీ వద్దకు వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆయన కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరపగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లను ఉంచింది.

కాంగ్రెస్ ఐదు డిమాండ్లు ఇవే..

1. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.

2. ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పూర్తి సమాధానం చెప్పాలి.

3. పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, భవిష్యత్తుపై ప్రత్యేకంగా చర్చించాలి.

4. బాధితులైన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.

5. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన హింస, లాఠీఛార్జ్‌పై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలి.

కాంగ్రెస్ నేతలతో చర్చల అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి, ఈ ఐదు డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందింస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story