- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ ఉద్యోగి మరణిస్తే అండగా నిలిచిన ఆబ్కారీ ఉద్యోగులు
విధుల పట్ల నిబద్ధతతో ఉంటూ అకాల మరణం చెందిన ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ,తెలంగాణ బ్యూరో: విధుల పట్ల నిబద్ధతతో ఉంటూ అకాల మరణం చెందిన ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. సచివాలయంలోని రెవిన్యూ ఎక్సైజ్ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ,ఈ నెల 8న గుండెపోటుతో కన్నుమూసిన చిర్ర ఏకాంబరం కుటుంబానికి రూ. 3,46,000 ఆర్థిక సాయాన్ని మంగళవారం అందజేశారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్ చేతుల మీదుగా మృతుడి భార్య స్వప్నలతకు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఏకాంబరం మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం, నాన్ గెజిటెడ్ మినిస్టీరియల్ సిబ్బంది,ఎగ్జిక్యూటివ్ సంఘాల సభ్యులు విరాళాలు సేకరించారు.
ఇందులో గెజిటెడ్ అధికారుల సంఘం తరపున రూ. 2.75 లక్షలు, మినిస్టీరియల్ సిబ్బంది తరపున రూ. 71 వేలను పోగుచేసి సహాయ నిధిగా జమ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సేవానిరతిని కమిషనర్ హరికిరణ్ ప్రత్యేకంగా అభినందించారు. తోటి సిబ్బందికి ఆపద వచ్చినప్పుడు అండగా నిలవడం గొప్ప విషయమని పేర్కొన్న ఆయన,తన వంతుగా వ్యక్తిగతంగానూ ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చి పెద్దమనసు చాటుకున్నారు.ఈ చొరవను తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ నాయకత్వం కొనియాడింది.
జేఏసీ అధ్యక్షుడు జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ తదితరులు మాట్లాడుతూ.. ఒక ప్రైవేట్ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగులు కొండంత అండగా నిలవడం అభినందనీయమన్నారు. మృతుడి కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ యాసిన్ ఖురేషి, సైబరాబాద్ ఉప కమిషనర్ జె. హరి కిషన్, సంఘం నేతలు టి. లక్ష్మణ్ గౌడ్, చంద్రశేఖర్, అధికారుల సంఘం ప్రతినిధులు కె.విజయ్ కుమార్, బి.ప్రవీణ్ కుమార్, ఎం.రాధ, జయసుధ, సౌజన్య, నాన్ గెజిటెడ్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, డి.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






