- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ లో నిర్మాణాత్మక చర్చలు జరగాలి. - ఎంపీలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీకు విజ్ఞప్తి చేశారు. దేశ పురోగతిని కాంక్షిస్తూ ప్రజాప్రతినిధులందరూ అవగాహనతో, గౌరవప్రదమైన చర్చల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభానికి ముందు మీడియాను ఉద్దేశించి ప్రధాని మోడీ మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆ సంస్థలోని యువ శాస్త్రవేత్తల సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని, తానేమీ ‘56 ఏళ్ల యువకుడి’ (రాహుల్ గాంధీ) గురించి మాట్లాడటం లేదంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి విజయాలే భారతదేశాన్ని గర్వపడేలా చేస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రైవేట్ రంగం నుండి ఇలాంటి ప్రయోగాలు చేపట్టిన దేశాలు అతి కొన్ని మాత్రమే ఉన్నాయని, భారతీయ యువత అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను అధిరోహించడం అద్భుతమైన విజయమని కొనియాడారు.
గత నెల రోజుల్లో కీలక విజయాలు
గత నెల రోజుల్లో భారత్ అనేక కీలక మైలురాళ్లను సాధించిందని, ఇది అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను, విశ్వసనీయతను పెంచిందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల వల్లే యువ పారిశ్రామికవేత్తలు ధైర్యంగా అడుగులు వేసి విజయాలు సాధించగలుగుతున్నారని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లో ఆయిల్ రిఫైనరీ జాతికి అంకితం చేయడం, దేశంలో మూడో సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభించడం, గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలును అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రధాని ప్రస్తావించారు. పశ్చిమాసియాలో యుద్ధాల కారణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ, భారత్ 7.7 శాతం జీడీపీ వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని తెలిపారు. సభలో చర్చలు నిజా నిజాలు, హేతుబద్ధత ఆధారంగా సాగాలని, ప్రతి ఒక్కరి అభిప్రాయానికి గౌరవం దక్కాలని ఆయన అన్నారు. దేశం అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తున్న తరుణంలో, నిర్మాణాత్మక చర్చల ద్వారా పార్లమెంట్ నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలని, పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ సహకరించాలని మోదీ కోరారు.
సభ తొలి రోజే రసాభాస
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే రసాభాసగా మారాయి. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, అలాగే అయోధ్య రామ మందిర విరాళాల నిధుల దుర్వినియోగంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసనలు చేశారు. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ రెండు కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టారు. అయితే మరణించిన ఆరుగురు మాజీ ఎంపీలకు ఆ సమయంలో సంతాప తీర్మానాలు చదువుతున్నారు. ఇలాంటి సమయంలో నిరసనలు తెలిపడం సరికాదని స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగాయి. ఈ స్వల్ప వ్యవధిలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ 'సుప్రీం కోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026’ను ప్రవేశపెట్టారు. మళ్లీ సభలో ప్రతిపక్ష ఎంపీలు బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ మళ్లీ సమావేశమైనప్పటికీ, నిరసనలు తగ్గకపోవడంతో సభను ఆరుసార్లు వాయిదా వేసిన అనంతరం, మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ అదే గందరగోళం
రాజ్యసభలోనూ నీట్ పేపర్ లీక్, రామ మందిర విరాళాల అంశంపై ప్రతిపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేస్తూ నిరసన తెలపడంతో సభ రోజంతా వాయిదా పడింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే జీరో అవర్‌లో నీట్ పేపర్ లీక్ వివాదం, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల వైఖరిని లేవనెత్తారు. నిరసన గళాలను అణచివేయడానికి ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును విస్మరించలేమని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని దెబ్బతీశాయని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనను ప్రస్తావిస్తూ.. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటే, ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించి వారిని అక్కడ నుండి తరిమేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా.. అంతకు ముందు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, బీజేపీ ఎంపీలు డాక్టర్ ముకేష్ భాయ్ జె రథ్వా, మహేష్ కేవట్, ప్రకాష్ చిక్ బారైక్, ఎన్‌పీపీ నేత జేమ్స్ సంగ్మా సహా కొత్తగా ఎన్నికైన సభ్యులతో చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు.






