తెలుగుదేశంలో మళ్లీ చంద్రహాస వెలుగులు

by Ravi |
తెలుగుదేశంలో మళ్లీ చంద్రహాస వెలుగులు
X

ఆరోగ్య కారణాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడంతో, టీడీపీ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో తెలుగు దేశం పార్టీకి, పార్టీ శ్రేణులకు భారీ ఉపశమనం వచ్చిందనే చెప్పాలి.

ముందున్న సమస్యలు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో లభించిన బెయిల్‌ను నిజంగానే ఊరటగా పరిగణించాలా ఈ బెయిల్ ద్వారా ఆయన పూర్తిగా సేఫ్ జోన్ చేరుకున్నట్లేనా అంటే పూర్తిగా అవునని చెప్ప లేని పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే హైకోర్టు చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.. చంద్రబాబు మీద ఇంకా అనేక కేసులు పెండింగులోనే ఉన్నాయి. అన్నీ వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన అవినీతి కేసులే. అందుకే ఏదో ఒక కేసులో ఆయన మళ్లీ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అనేది చాలా కీలకమైనది.

ఇటీవలి కాలంలోనే చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఇసుక కుంభకోణం మీద కూడా కేసు నమోదు అయింది. వీటిలో కొన్ని కేసుల మీద చంద్రబాబు నాయుడు ముందుగానే బెయిల్ తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పుంగనూరు అంగళ్లు వద్ద రెచ్చగొట్టిన అల్లర్లకు సంబంధించి.. నమోదు అయిన కేసులో మాత్రమే చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన మీద అవినీతి, అక్రమార్జనలకు సంబంధించిన కేసులన్నీ అలాగే ఉన్నాయి.

ఇరు పార్టీల సమన్వయంతో..

చంద్రబాబు అరెస్ట్ కాగానే, జైలు బయటే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనతో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధమయింది. పొత్తుల దిశగా టీడీపీ, జనసేన మరో అడుగు ముందుకు పడింది. ఉమ్మడి ప్రణాళికను రచించుకుని ముందుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రెండు పార్టీలు ప్రాథమికంగా ఒకటయ్యాయి.ప్రజా సమస్య లపై పోరాటానికి ఉమ్మడి ప్రణాళిక ఆ తర్వాత పార్టీ సిద్ధాంతాలు, సీట్ల సర్దుబాటు. తదితర ఆంశాలపై స్పష్టత రానున్నది. సమన్వయ కమిటీ చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం దక్కింది. ఎన్నికల ముందు తీసుకోవాల్సిన పలు నిర్ణయాలు పార్టీ కార్యక్రమాలతో చంద్రబాబు నిమగ్నం కాబోతున్నారు. అనుభవం పరిణితి చెందిన రాజకీయ వేత్త తనదైన శైలిలో వ్యూహాలు రచించి పాలకపక్షాన్ని ఇరుకున పెడతారనేది నిర్వివాదాంశం.

వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పొత్తుకు సంబంధించి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ఆయా నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు నాయకత్వాలు నిర్ణయించాయి. అయితే.. ఈ సమావేశాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పొసగకపోవటంతో.. గొడవలు తలెత్తుతున్నాయి. ఇరు పార్టీల నాయకుల మధ్య సత్సంబంధాలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో కేడర్ మధ్య అంతగా మంచి సంబంధాలు లేకపోవటమే.. ఈ సమన్వయ కమిటీ సమావేశాలు పెట్టడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే.. ఆ సమావేశాల్లో కూడా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు జరుగుతూ.. విభేదాలు బయటపడుతున్నాయి. ఇక లోకేష్ పాదయాత్ర చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపివేశారు.

కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. అయితే తిరిగి అక్కడి నుంచే యాత్రను ప్రారంభించనున్నారు. అయితే ముందు అనుకున్న దాని ప్రకారం ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు విశాఖతోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఖరారైతే ఆయన పాదయాత్ర పది, 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేసే నిమిత్తం ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ యాత్రపై అధికార పక్షం చేసే వ్యాఖ్యలకు అధినేత ఎలా సమర్దిస్తారో చూడాలి.

తెలుగుదేశం మ్యానిఫెస్టో

ఏపీలో వచ్చే ఏడాది 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పొత్తు ఖరారు చేసుకున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు. ప్రస్తుత పథకాలతో పాటు కొన్ని ఇతర అంశాలకు గతంలో మహానాడు వేదికగా ప్రకటించిన వివిధ విధానాలు మెదలైన ఆంశాలపై చర్చించి తుది మెరుగులు దిద్దాల్సిన బాధ్యత అధినేత భుజస్కందాలపై వుంది. ఈ సమయం నారా చంద్రబాబు నాయుడుకి ఎంతో కీలకం. సంయమనంతో సకారాత్మక విమర్శలతో పదునైన వ్యూహాలతో పార్టీని బలోపేతం చేయాలి. సామాన్య కార్యకర్త నుంచి పెద్దనాయకుడి వరకు అందరిని సమన్వయ పరచాలి. గతంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవాలి. కోటరీని నమ్మకుండా స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. పొత్తుల నేపథ్యంలో పార్టీ కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి. ఆ దిశగా పార్టీని శ్రేణులను సిద్దపరచాలి. త్వరితగతిన అభ్యర్థుల ఎంపిక చేసి క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించాలి. ప్రస్తుతం తెలుగు దేశం పట్ల ప్రజల్లో సానుకూల స్పందన వుంది. జనసేన పొత్తు సామాజిక సమీకరణాలు ప్రభుత్వ వ్యతిరేకతని సానుకూలంగా మలచుకొని ముందుకు సాగాలి. అధినేత నుంచి కార్యకర్త వరకూ ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. సమిష్టిగా శ్రమిస్తే మళ్ళీ తెలుగు దేశంలో చంద్రహాస వెలుగులే.

- వాడపల్లి శ్రీధర్

99898 55445

Next Story

Most Viewed