వారంలో 1000 శాతం.. ప్రభుత్వమే తప్పు చేస్తే ఎలా: చంద్రబాబు

by  |
వారంలో 1000 శాతం.. ప్రభుత్వమే తప్పు చేస్తే ఎలా: చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తప్పులు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడుతోందని అన్నారు.

భారతదేశంలో కరోనా కేవలం వారం రోజుల్లో 222 శాతం పెరిగిందని ఆయన అన్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో 1021 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించాలని ఆయన సూచించారు. దేశంలో కరోనా పరీక్షలు చాలా తక్కువ జరుగుతున్నాయన్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో వీటి పరీక్ష మరీ దారుణమని ఆయన ఆందోళన చెందారు. అంతా సోషల్ డిస్టెన్స్ అంటుంటే..తాను మాత్రం ఫిజికల్ డిస్టెన్స్ అంటున్నానని, దానినే నిపుణులు నిర్ధారిస్తున్నారని ఆయన తెలిపారు.

చిన్న రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో కరోనా పరీక్షల ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే.. కేవలం మన రాష్ట్రంలో మాత్రం 6 ల్యాబులే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. అమెరికా, స్పెయిన్ వంటి అత్యాధునిక దేశాలు, న్యూయార్క్ వంటి అత్యాధునిక దేశాలే కరోనా బారినపడి విలవిల్లాడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

కరోనా గురించి భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందని ఆయన అన్నారు. కరోనా గురించి భయపడడం కంటే అవగాహన కల్పించుకోవాలని ఆయన సూచించారు. సామాజిక దూరం పాటిస్తూనే కుటుంబ సభ్యులతో బంధాలు పెంచుకునేందుకు ఇది చాలా మంచి, అనువైన సమయమని ఆయన సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. శరీరాన్ని ధృఢంగా ఉంచుకుంటూ, మానసికంగా ధైర్యంగా ఉంటే కరోనాను జయించడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన తెలిపారు.

సాక్షాత్తూ బిల్ గేట్స్ దీనికి వ్యాక్సిన్ లేదని అన్నారని ఆయన చెప్పారు. ఒక వేళ వ్యాక్సిన్ తేవాలన్నా 12 నెలల సమయం పడుతుందని అంటున్నారని ఆయన చెప్పారు. 7 వ్యాక్సిన్లు పరీక్షల దశలో ఉన్నాయని, అవి కూడా సమర్థవంతంగా పని చేస్తాయని చెప్పలేమని అంటున్నారని ఆయన తెలిపారు. ప్రజల సహకారం లేకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కరోనాను నియంత్రించాలని ఆయన సూచించారు.

Tags: tdp, chandrababunaidu, cbn, ap, corona virus

Next Story

Most Viewed