గ్రామ పంచాయతీలు నడిపేదేట్లా...?

by Aamani |
గ్రామ పంచాయతీలు నడిపేదేట్లా...?
X

దిశ,సైదాపూర్ : గ్రామపంచాయతీలు నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లలో డీజిల్‌ పోయడానికి కూడా డబ్లుల్లేని పస్థితి. పంచాయతీ భవనాల, నల్లాల బావులు, బోరు మోటార్లుకు కరెంటు బిల్లులు కట్టడానికి కూడా నిధుల్లేవని గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం( ఎస్ఎఫ్సీ.)నిధులను సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా 313 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం (ఎస్.ఎఫ్.సీ) కింద ప్రతి నెలా రూ.3.06 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. 2022 ఆగస్టు వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ చేసిన రాష్ట్ర సర్కార్.. ఆ తర్వాత పెండింగ్‌ పెడుతూ వస్తోంది. దీంతో, మొత్తంగా గ్రామ పంచాయతీలకు (ఎస్ఎఫ్సీ) నిధులు సుమారు రూ. 64.26 కోట్లు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు రావాల్సిన నిధులు రాకపోవడం, ఇతర ఆదాయ వనరుల్లేక పోవడంతో గ్రామాల్లో కనీస సమస్యలను కూడా పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందని సంబంధిత అధికారులు చెబుతున్నాయి.

పాలక వర్గం ఎన్నికల తరువాతే నిధులు..

పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేయకపోయినా పాలకవర్గాలు ఉన్నపుడు సర్పంచులు ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు చేసే పనులు ఆగకుండా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభమైంది. కొన్ని చోట్ల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పనులు నిలిచిపోకుండా ఉండేందుకు డబ్బులు సర్దుబాటు చేసినప్పటికీ.. నెలల తరబడి పంచాయతీలను ఎలా నిర్వహించాలన్న దానిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రత్యేక అధికారుల పాలనలో రావని, మళ్లీ పంచాయతీల పాలకవర్గాలను ఎన్నుకున్న తర్వాతే కేంద్రం నిధులు విడుదలయ్యె అవకాశం ఉంది. గతంలో ఎస్‌.ఎఫ్.సీ నిధులు రాకున్నా.. కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా పాలకవర్గాలు గ్రామ పంచాయతీలను నెట్టుకు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవీ రాకపోవడంతో ఆదాయ వనరుల్లేని గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది.

వేతనాలు కోసం కార్మికుల ఒత్తిడి..

గ్రామ పంచాయతీల్లో నిధుల్లేక చాలా చోట్ల సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా కార్మికులు పనులు చేయడం లేదు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ప్రతి 500 మంది జనాభాకు ఒక మల్టీపర్పస్‌ కార్మికుడిని నియమించే అవకాశం కల్పించింది. వీరు విద్యుత్‌ లైట్లు, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, చెత్త ట్రాక్టర్‌ నడిపించడం, మంచినీటి సరఫరా వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వీరికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇక, మేజర్‌ పంచాయతీల్లో అవసరమైనంత సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటే.. వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా ఉంటోందని, ఇప్పటికే బకాయి వేతనాల కోసం కార్మికులు తమపై ఒత్తిడి తెస్తున్నారని ప్రత్యేకాధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed