గవర్నర్ తీరుపై కోర్టుకు విజయ్

by Muthe.Rajitha |   (  Updated:2026-05-08 08:47:28  IST  )

భారత రాజ్యాంగ పరిధిలోని గవర్నర్ విచక్షణాధికారాలపై టీవీకే పార్టీ అధినేత విజయ్ కోర్టుకు వెళ్లనున్నారని సమాచారం.

గవర్నర్ తీరుపై కోర్టుకు విజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత రాజ్యాంగ పరిధిలోని గవర్నర్ విచక్షణాధికారాలపై టీవీకే పార్టీ అధినేత విజయ్ కోర్టుకు వెళ్లనున్నారని సమాచారం. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలు గెలుచుకుని, కాంగ్రెస్ మద్దతుతో 113 స్థానాలకు చేరుకున్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం ఐదు అడుగుల దూరంలో ఆగిపోయింది. సాధారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు, అతిపెద్ద పార్టీని లేదా ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించి, అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకోమని (Floor Test) కోరడం సంప్రదాయం. అయితే, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రెండు రోజుల పాటు విజయ్‌తో చర్చలు జరిపినప్పటికీ, రాతపూర్వకమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదన్న కారణంతో నేరుగా అసెంబ్లీని రద్దు చేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ, న్యాయపరమైన వివాదానికి దారితీసింది. ఇది కేవలం ఒక పార్టీకి దక్కిన అవకాశం కోల్పోవడం మాత్రమే కాదు, ప్రజలు ఎన్నుకున్న సభను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండానే రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కోర్టు విజయ్ వైపేనా ?

ఈ నేపథ్యంలో విజయ్ బృందం న్యాయపోరాటం వైపు అడుగులు వేయడం అత్యంత కీలకమైన పరిణామం. సుప్రీం కోర్టు గతంలో ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇక్కడ ప్రధానాస్త్రంగా మారే అవకాశం ఉంది. మెజారిటీ అనేది రాజ్‌భవన్ గదుల్లో నిర్ణయించేది కాదని, అది కేవలం అసెంబ్లీ ఫ్లోర్ మీద మాత్రమే తేలాలని ఆ తీర్పు స్పష్టం చేసింది. అలాగే, సర్కారియా కమిషన్, పూంఛీ కమిషన్ సిఫార్సుల ప్రకారం, స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు గవర్నర్ మొదటగా అతిపెద్ద పార్టీని లేదా ఎన్నికల ముందే కుదుర్చుకున్న కూటమిని ఆహ్వానించాలి. ఒకవేళ విజయ్ బృందం కోర్టును ఆశ్రయిస్తే, గవర్నర్ తన రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వహించలేదని, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే అసెంబ్లీని రద్దు చేశారని వాదించే అవకాశం ఉంది. కోర్టు గనుక గవర్నర్ నిర్ణయంపై స్టే ఇచ్చి, విజయ్‌కు మెజారిటీ నిరూపించుకోవడానికి సమయం ఇస్తే, అది తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అసాధారణ విజయంగా నిలుస్తుంది.

ఇటు ప్రజలతో.. అటు రాజ్యాంగ వ్యవస్థలతో

ఇక టీవీకే అధినేత విజయ్ తన మొదటి పొలిటికల్ ఎంట్రీలోనే ఇటు ప్రజల తీర్పుతోనూ, అటు రాజ్యాంగ వ్యవస్థలతోనూ తలపడాల్సి వస్తోంది. 113 సీట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నది TVK శ్రేణుల ప్రధాన ఆరోపణ.ఈ క్రమంలోటీవీకే కార్యకర్తలు లోక్ భవన్ ముందు నిరసనకు దిగారు. స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల మద్దతు కూడగట్టే అవకాశం విజయ్‌కు ఇవ్వకుండానే సభను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు భావిస్తున్నారు. కోర్టు విచారణలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న హేతుబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ న్యాయస్థానం అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తే, అది విజయ్‌కు నైతిక విజయమే కాకుండా, రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ మొత్తం ఉదంతం భారత రాజకీయాల్లో గవర్నర్ వ్యవస్థ పాత్రపై, హంగ్ అసెంబ్లీ సమయాల్లో అనుసరించాల్సిన నిబంధనలపై మరోసారి దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్: విజయం తథ్యమని విజయ్ ఆసక్తికర ట్వీట్

బీజేపీ గుప్పిట్లో డీఎంకే, అన్నాడీఎంకే.. తమిళనాడులో బీహార్ సీన్ రిపీట్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు


Next Story