- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదర్శం... పేరుకేనా? అధికారుల పర్యటనలోనూ బయటపడిన నిర్లక్ష్యం..!
సమగ్ర అభివృద్ధిలో భాగంగా కాళోజివాడి గ్రామాన్ని "మోడల్ పంచాయతీ"గా తీర్చిదిద్దుతామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

దిశ, తాడ్వాయి : సమగ్ర అభివృద్ధిలో భాగంగా కాళోజివాడి గ్రామాన్ని "మోడల్ పంచాయతీ"గా తీర్చిదిద్దుతామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పంచాయతీ కార్యాలయంలోని సమాచార బోర్డులు ఇప్పటికీ అప్‌డేట్ కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శనివారం జడ్పీ సీఈవో చంద్ర నాయక్, పీడీ దామోదర్ రెడ్డి, డీపీవో మురళి, ఎంపీడీవో భారత్ కుమార్ కాళోజివాడి గ్రామ పంచాయతీని సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే, అధికారుల సమక్షంలోనే కార్యాలయంలో ఉన్న సమాచార పట్టికలు పాత వివరాలతో కొనసాగుతున్న విషయం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.
40 రోజులైనా మారని కార్యదర్శి పేరు ..
గ్రామ పంచాయతీ కార్యదర్శి బదిలీపై వెళ్లి 40 రోజులు దాటినా, కార్యాలయ బోర్డుపై ఇప్పటికీ పాత కార్యదర్శి పేరే కొనసాగుతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శి వివరాలను నమోదు చేయకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉపసర్పంచ్ ఫోన్ నంబర్ స్థానంలో పాత నంబర్‌పైనే కొత్త నంబర్ స్టిక్కర్ అతికించి సరిపెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది.
సమాచార హక్కు బోర్డులోనూ పాత వివరాలే..
సమాచార హక్కు చట్టం ప్రకారం కార్యాలయంలో ప్రదర్శించాల్సిన వివరాల బోర్డులో కూడా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎంపీడీవో భారత్ కుమార్ పేరు నమోదు చేయకుండా పాత వివరాలనే కొనసాగించడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, అదే నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు అంటున్నారు.
అధికారుల పర్యటన దేనికోసం..?
జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా గ్రామ పంచాయతీని సందర్శించినప్పటికీ, కార్యాలయంలో కనిపిస్తున్న ఈ లోపాలను గుర్తించలేదా? లేక గుర్తించినా పట్టించుకోలేదా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. "మోడల్ పంచాయతీ" అనే పేరుకు తగ్గట్టుగా ముందుగా కార్యాలయ నిర్వహణ, సమాచార బోర్డులు, పారదర్శకత వంటి అంశాలను సరిచేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ సమాచార పట్టికలు, సమాచార హక్కు చట్టం బోర్డు, పాలకవర్గం-అధికారుల వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.






