మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ భార్య కన్నుమూత.. సీఎం సంతాపం

by Naga Rani Yarlagadda |

భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ భార్య చెన్నమ్మ (89) శనివారం సాయంత్రం కన్నుమూశారు.

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ భార్య కన్నుమూత.. సీఎం సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ భార్య చెన్నమ్మ (89) శనివారం సాయంత్రం కన్నుమూశారు. కొద్దిరోజులుగా వృద్ధాప్య, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ఆమె మరణించే సమయంలో భర్త దేవెగౌడ, వారి కుమారుడు, కేంద్రమంత్రి హెచ్.డీ కుమారస్వామితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. కాగా.. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. చెన్నమ్మ భౌతికకాయాన్ని శనివారం రాత్రి బెంగళూరు పద్మనాభనగర్‌లోని వారి నివాసానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతారు. అనంతరం సోమవారం నాడు హాసన్ జిల్లాలోని వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1954లో దేవెగౌడతో వివాహమైన చెన్నమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, హోలేనరసిపుర ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణ ప్రముఖులు. కాగా, ఫిబ్రవరి 2001లో కుటుంబ కలహాల కారణంగా ఆమెపై జరిగిన యాసిడ్ దాడి నుండి చెన్నమ్మ ప్రాణాలతో బయటపడ్డారు.

కర్ణాటక సీఎం సంతాపం..

చెన్నమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే దానికి చెన్నమ్మ నిదర్శనమని, దేవెగౌడ రాజకీయ ఎదుగుదలలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. అలాగే కర్ణాటక ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్. అశోక, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప, బిజెపి కర్ణాటక అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర తదితరులు ఆసుపత్రిని సందర్శించి, సామాన్య, నిరాడంబర జీవితాన్ని గడిపిన చెన్నమ్మ మృతి పట్ల దేవెగౌడ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story