బల్మూరు బీసీ బాలుర వసతి గృహంలో దయనీయ పరిస్థితులు

by Batti.Sumithra |

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారాయని నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కో-ఆర్డినేటర్ సాయి మహరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

బల్మూరు బీసీ బాలుర వసతి గృహంలో దయనీయ పరిస్థితులు
X

దిశ, బల్మూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారాయని నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కో-ఆర్డినేటర్ సాయి మహరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, హాస్టల్‌లో మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో రోజులు గడుపుతున్నామని తెలిపారు. గతంలో భవనం శిథిలాలు ఊడిపడి కొందరు విద్యార్థులకు గాయాలైనప్పటికీ, అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాయి మహరాజ్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాలపై ఆధారపడి చదువుకుంటున్నప్పటికీ, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వసతి గృహాల పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ఈ సమస్య పై గత ఏడాది ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, శిథిలావస్థలో ఉన్న వసతి గృహ భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలని, విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీరు, భద్రతతో కూడిన వసతి వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాలని సాయి మహరాజ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బల్మూరు మండల నాయకులు కిషోర్ ముదిరాజ్, చంద్రశేఖర్ మహరాజ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


Next Story