- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలలు సురక్షితమేనా..?
విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయా ? పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెప్పడం, విద్యార్థులతో సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌లు చేయడం ఉపాధ్యాయ వృత్తికి ఏ మేరకు ఆమోదయోగ్యం అనే చర్చ తీవ్రంగా సాగుతోంది.

దిశ, కూకట్‌పల్లి : విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయా ? పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెప్పడం, విద్యార్థులతో సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌లు చేయడం ఉపాధ్యాయ వృత్తికి ఏ మేరకు ఆమోదయోగ్యం అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఓ 9వ తరగతి బాలిక ఆత్మహత్యకు కారణమైన ఉపాధ్యాయుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించడం, ప్రైవేట్ పాఠశాల అనుమతులు లేకుండానే నిబంధనలను బేఖాతరు చేస్తూ పాఠశాలను నిర్వహిస్తుండటం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చూస్తుంటే విద్యాసంస్థలు సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కూకట్‌పల్లిలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో ఎస్‌ఎం మోడల్ స్కూల్ టీచర్ నరేష్ పై కూకట్‌పల్లి పోలీసులు పోక్సోతో పాటు బీఎన్‌ఎస్ 108 (ఐపీసీ 306) సెక్షన్ల కింద కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్ని నెలలుగా టీచర్ నరేష్ 9వ తరగతి బాలిక (14)తో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల ద్వారా చాటింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్ నరేష్ పై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు బీఎన్‌ఎస్ 108 (ఐపీసీ 306), మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించినందుకు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
పాఠశాలలో యాజమాన్యం పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడం, అసలు యజమాని పాఠశాలను నిర్వహించకుండా కోటేశ్వర్‌రావు అనే వ్యక్తికి లీజు ప్రకారం ఎస్‌ఎం మోడల్ స్కూల్‌ను అప్పగించినట్లు సమాచారం. పాఠశాలకు కేవలం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మాత్రమే విద్యాశాఖ నుంచి అనుమతులు ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న టీచర్ నరేష్ ఎస్‌ఎం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
100 మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకం..
కూకట్‌పల్లి మండలం, మూసాపేట్ జనతానగర్ కాలనీలో ఉన్న ఎస్‌ఎం మోడల్ స్కూల్‌కు చెందిన టి. వినేష్ సింగ్ అనే వ్యక్తి 1 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించుకునేందుకు విద్యాశాఖ నుంచి (ఆర్‌సీ నంబర్: 1723/A3/2020) అనుమతులు పొందారు. ఇదిలా ఉండగా, నిరుపేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కావడంతో కార్పొరేట్ పాఠశాలలకు వెళ్లలేని పేద, మధ్యతరగతి ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఎస్‌ఎం మోడల్ స్కూల్ యాజమాన్యం, అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుని, అదే ప్రాంతంలోని మరో ప్రైవేట్ పాఠశాల ద్వారా యూడైస్ (UDISE) పోర్టల్‌లో ఎంట్రీ చేయించినట్లు సమాచారం.
పాఠశాల టీచర్ నరేష్ కారణంగా 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి, పోలీసులను ఆశ్రయించడంతో టీచర్ నరేష్ పై పోలీసులు పోక్సో కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారన్న విషయం వెలుగులోకి రావడంతో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తుండటంతో తమ పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మౌనంగా ఉన్న విద్యాశాఖ..
ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఎస్‌ఎం మోడల్ స్కూల్ ఘటనతో బయటపడింది. అనుమతులు ఒకలా ఉండగా, పాఠశాలలు మరోలా నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ పాఠశాలలపై నిఘా పెంచుతున్నామని, అనుమతులు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, మూసాపేట్‌లోని ఎస్‌ఎం మోడల్ స్కూల్ వ్యవహారంతో విద్యాశాఖ అధికారులు ఎంత మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విచారణ జరుగుతోంది.. చర్యలు తీసుకుంటాం: రవీంద్ర రాజు, ఎంఈఓ, కూకట్‌పల్లి మండలం
ఎస్‌ఎం మోడల్ స్కూల్ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. త్వరలోనే పాఠశాల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ రవీంద్ర రాజు పేర్కొన్నారు.






