‘భూ భారతి’ స్కామ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-12 02:41:21  IST  )

జిల్లాలో జరిగిన భూ భారతి స్కాంతో సంస్థాన్ నారాయణపురం మండలానికి కూడా లింకు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

‘భూ భారతి’ స్కామ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
X

జనగాం ‘భూ భారతి’ స్కామ్ ప్రకంపనలు సంస్థాన్ నారాయణపురం మండలానికి పాకగా, సుమారు 50 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు అధికారులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీ సొమ్ము స్వాహా చేసిన నిందితులను సోమవారం కలెక్టరేట్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 1300 డాక్యుమెంట్లు ఈ తరహా మోసానికి గురైనట్లు తెలుస్తుండటంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు.

దిశ, సంస్థాన్ నారాయణపురం: జనగాం జిల్లాలో జరిగిన భూ భారతి స్కాంతో సంస్థాన్ నారాయణపురం మండలానికి కూడా లింకు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 1300 డాక్యుమెంట్లు ఈ తరహా మోసానికి గురైనట్లు జిల్లా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. భూ భారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన సొమ్మును స్వాహా చేసిన వారి వివరాలను ఇప్పటికే జిల్లా అధికారులు సేకరించి వారిపై విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మండలానికి చెందిన పలు డాక్యుమెంట్లను గుర్తించి అందుకు బాధ్యులైన వారికి ఫోన్లు వచ్చినట్లు సమాచారం.

50కి పైగా డాక్యుమెంట్లు!

సంస్థాన్ నారాయణపురం మండలంలో భూ భారతి పోర్టల్ ద్వారా స్కామ్ కు పాల్పడినవి సుమారు 50కి పైగానే ఉన్నట్లు జిల్లా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. భూ భారతి పోర్టల్‌లో సిటిజన్ లాగిన్ ద్వారా స్లాట్లు బుక్ చేసిన వారిని గుర్తించి ఇప్పటికే వారికి జిల్లా అధికారులు ఫోన్ చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ తరహా డాక్యుమెంట్లు చేసిన వారిని విచారించి చర్యలు చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మండల కేంద్రంలో ఫేక్ సర్టిఫికెట్లకు అడ్డాగా మారిందని ఆధారాలతో సహా ‘దిశ’ ప్రచురితం చేసిన అధికారులు ఎవరూ వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి మోసాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. జనగాం జిల్లాలో బయటపడిన స్కాం జిల్లాలోని అన్ని మండలాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.

మోసాన్ని గుర్తించింది ఇలా..

భూ భారతి స్కాం మోసాన్ని అధికారులు డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి గుర్తించారు. భూ భారతి పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్లేటప్పుడు డాక్యుమెంట్ ప్రింట్ తీసుకొని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. ప్రింట్ తీసిన డాక్యుమెంట్‌లో ఆన్‌లైన్ ద్వారా భూ భారతి పోర్టల్‌లో చెల్లించిన స్టాంప్ డ్యూటీ వివరాలతో ఒక సమ్మరీ వస్తుంది. అయితే ఈ సమ్మరీలో రైతు చెల్లించిన డబ్బుల వివరాలు పూర్తిగా చూపించిన అదే పేజీలో కింద ఎస్బీఐ E-Pay అని చూపించే డబ్బులలో తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతోనే ఈ తరహా మోసం బయట పడినట్లు తెలుస్తోంది. ఇలాంటివి మండలానికి సంబంధించినవి కూడా చాలానే ఉన్నట్లు తెలియడంతో వారిని విచారణకు పిలిచినట్లు సమాచారం. అయితే దీన్ని తహశీల్దార్‌లు సంతకం చేసే సమయంలో గుర్తించాల్సి ఉన్నా అది పెద్దగా పరిశీలన చేయకపోవడంతో వారి దృష్టికి రానట్లు తెలుస్తోంది.

READ MORE .....

సంచలనం సృష్టిస్తున్న భూభారతి స్కామ్.. జిల్లాలోనే చౌటుప్పల్ టాప్!

యాదాద్రిలో ‘భూ భారతి’ స్కామ్ ప్రకంపనలు

Next Story