యాదాద్రిలో ‘భూ భారతి’ స్కామ్ ప్రకంపనలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-12 02:39:19  IST  )

భూ భారతి పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను ఉపయోగించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం పెద్దఎత్తున ఈ స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు‌

యాదాద్రిలో ‘భూ భారతి’ స్కామ్ ప్రకంపనలు
X

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ భారతి పోర్టల్ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని జరిగిన భారీ రిజిస్ట్రేషన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాల్లో రంగారెడ్డి తర్వాత అత్యధికంగా ఈ జిల్లాలోనే 1300 డాక్యుమెంట్లు ఉన్నట్లు సీసీఎల్‌ఏ గుర్తించింది. చలాన్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు కాకుండా సొంత ఖాతాలకు మళ్లించి అక్రమార్కులు కోట్లు స్వాహా చేశారు. ప్రధానంగా యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మండలాల్లో ఈ దందా జోరుగా సాగినట్లు అధికారులు లిస్టులు సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసే సమయంలో తహసీల్దార్లు ఈ వ్యత్యాసాలను ఎందుకు గుర్తించలేదనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్‌లో రెవెన్యూ సిబ్బంది, మీసేవ నిర్వాహకుల పాత్రపై విచారణ ముమ్మరం చేస్తూ, అక్రమ సొమ్ము వసూలుకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది.

దిశ, యాదాద్రిభువనగిరి ప్రతినిధి : భూ భారతి పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను ఉపయోగించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం పెద్దఎత్తున ఈ స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు‌. జిల్లాలో దాదాపుగా 1300 డాక్యుమెంట్లు ఇప్పటివరకు ఈ తరహాలో జరిగాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు. జనగామలో వెలుగు చూసిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై సీసీఎల్‌ఏ విచారణకు ఆదేశించగా పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంట్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

జిల్లాలో దాదాపు 1300 డాక్యుమెంట్ల గుర్తింపు..

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ అవకతవకలు మొత్తం 4,300 లావాదేవీల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో జరిగాయని సీసీఎల్‌ఏ వెల్లడించింది. ఈ జిల్లాలో 2,100 లావాదేవీల చలానాల్లో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 1300 లావాదేవీల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఈ లావాదేవీలు ఎవరు చేశారు?, ఏ తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎక్కువ అయ్యాయి?, ఎవరి ద్వారా అయ్యాయనే విషయాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులు స్వాహా చేసిన నగదు వసూలుకు సైతం సీసీఎల్ఏ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అప్రమత్తమైన అధికారులు..

ఈ ఘటనపై అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఈ తరహాలో జరిగిన డాక్యుమెంట్ల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డాక్యుమెంట్లలో ఎక్కువగా యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ప్రాంతాల్లో అధిక స్థాయిలో డాక్యుమెంట్లు అయినట్లు, దీంతోపాటు మరి కొన్ని మండలాల్లో సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో ఈ తరహా డాక్యుమెంట్ల గురించి జిల్లా అధికారులు సైతం లిస్ట్ తయారు చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఈ స్కామ్‌కు పాల్పడిన బస్వారాజు, పాండులకు జిల్లాలో మిగతా ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, మీసేవా నిర్వాహకులు ఎవరైనా సహకరించారా? అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎవరైనా సహకరించారా? అనే కోణంలో సైతం విచారణ జరిపితే మరిన్ని విషయాలు తెలుస్తాయని పలువురు భావిస్తున్నారు.

అధికారుల పాత్రపై ఆరా..

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్న క్రమంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అని జిల్లాస్థాయి అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అయ్యే డీడ్ పేపర్స్ పై మార్కెట్ రేట్, చెల్లించాల్సిన మొత్తం, కొనుగోలు చేసిన వ్యక్తి చెల్లించిన మొత్తం వివరాలు అన్ని ప్రచురితమవుతాయి. ఇవి పోర్టల్ నుంచి ఆటోమేటిక్‌గా సంబంధిత తహశీల్దార్ వద్ద ప్రింట్ రూపంలో వస్తాయి. ఆ తర్వాత వీటిపై తహశీల్దార్ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సంతకం చేసే క్రమంలో వీటిని గుర్తించే వీలుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేసే క్రమంలో ఎందుకు గుర్తించలేదనే క్రమంలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

READ MORE .....

సంచలనం సృష్టిస్తున్న భూభారతి స్కామ్.. జిల్లాలోనే చౌటుప్పల్ టాప్!

‘భూ భారతి’ స్కామ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Next Story