అంగన్‌వాడీల హాజరు అంతంతే.. టాప్‌లో ఆదిలాబాద్

by Malleboina Mahesh |

తెలంగాణ అంగన్‌వాడీల్లో పిల్లల హాజరు శాతం మిశ్రమం.. 93.47% తో ఆదిలాబాద్ టాప్, 52.69% తో కరీంనగర్ లాస్ట్.. 90% కేంద్రాలకు విద్యుద్దీకరణ!

అంగన్‌వాడీల హాజరు అంతంతే.. టాప్‌లో ఆదిలాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్‌వాడీలు చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్న కీలక కేంద్రాలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చిన్నారులను అంగన్‌వాడీలకు రప్పించేందుకు పలు చర్యలు చేపడుతూ నిధులను సమకూరుస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చిన్నారుల హాజరు శాతం గణనీయంగా మారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లల హాజరు పై ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చాయి. కొన్ని జిల్లాలు 90 శాతానికి పైగా హాజరుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండగా, మరికొన్ని జిల్లాలు కనీసం 65 శాతం మార్కును కూడా దాటలేకపోతున్నాయి.

టాప్‌లో ఆదిలాబాద్

రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా 93.47 శాతం హాజరు తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 19,360 మంది లబ్ధిదారులైన పిల్లల్లో 18,095 మంది అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. అనంతరం కొమురం భీం-ఆసిఫాబాద్ (90.14 శాతం), ఖమ్మం (84.22 శాతం), ములుగు (82.69 శాతం) జిల్లాలు 80 శాతానికి పైగా హాజరుతో ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాలుగా నిలిచాయి. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలుగా భావించే ప్రాంతాల్లోనే అధిక హాజరు నమోదు కావడం గమనార్హం.

కరీంనగర్ జిల్లా లాస్ట్

అభివృద్ధి చెందిన జిల్లాలుగా చెప్పుకునే కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు హాజరు శాతంలో వెనుకబడటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా కరీంనగర్ జిల్లా కేవలం 52.69 శాతం హాజరుతో చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 16,971 మంది రిజిస్టర్డ్ పిల్లలు ఉండగా, కేవలం 8,942 మంది మాత్రమే అంగన్‌వాడీలకు హాజరవుతున్నారు. నల్గొండ జిల్లా 56.47 శాతంతో రెండో అత్యల్ప స్థానంలో ఉండగా, భారీ లబ్ధిదారులు ఉన్న రంగారెడ్డి జిల్లా (31,773 మంది) కేవలం 60.97 శాతం హాజరుతో మూడో అత్యల్ప స్థానంలో నిలిచింది. పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, సూర్యాపేట జిల్లాలు కూడా 65 శాతం కంటే తక్కువ హాజరును నమోదు చేశాయి. ఈనెల 13వ తేదీ నాటికి హాజరు గణాంకాలు ఇలా నమోదయ్యాయి.

అంగన్‌వాడీలకు విద్యుత్ వెలుగులు

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా గత ఆరు నెలల వ్యవధిలోనే 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 32,109 కేంద్రాలకు ప్రస్తుతం విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 90 శాతం కేంద్రాలు విద్యుదీకరణ పొందాయి. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలో విద్యుత్ సరఫరా చేసి, 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.

Next Story