పదవుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. జూమ్ మీటింగ్‌లో నేతకు క్లాస్ పీకిన సీఎం రేవంత్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-19 07:16:52  IST  )

‘సర్‌’ (SIR) కార్యక్రమాల పురోగతిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ కీలక జూమ్ సమావేశం ప్రారంభమైంది.

పదవుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. జూమ్ మీటింగ్‌లో నేతకు క్లాస్ పీకిన సీఎం రేవంత్
X

దిశ వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు సంబంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో టైం పాస్ చేస్తామంటే కుదరదు..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో కూర్చొని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా ప్రకటించిన సీఎం, దీనిని నాయకులంతా ఓ చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 489 సమావేశాలు జరిగాయని, అయితే బాగా వెనుకబడిన నియోజకవర్గాలపై ఇప్పటికైనా నేతలు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

గాంధీభవన్‌కు ఎవరూ రావొద్దు..

ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ఎవరూ గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, అలాంటి వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నాయకులు ఎవరూ గాంధీభవన్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లోనే కూర్చొని క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని మండిపడ్డారు. వచ్చే 10 రోజులు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు.

ఆ బాధ్యత పూర్తిగా మంత్రులదే..

ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని, ఈ కార్యక్రమం పూర్తి పర్యవేక్షణ, బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని, ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జీలుగా ఉన్న వారు నిరంతరం సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ నెల 30న ఎస్‌ఐఆర్‌పై మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, చైర్మన్లు కేవలం బీఎల్‌ఓల (BLO) రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడకుండా, పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏల (BLA) రిపోర్టులను నిశితంగా పరిశీలించాలని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story