పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..?

by Taduka Kalyani |

జహీరాబాద్ నిమ్జ్‌లో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులను డీపీఐఐటీ కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా పరిశీలించారు.

పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..?
X

దిశ, ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు జహీరాబాద్ జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి (నిమ్జ్) లో కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా, ఐఏఎస్, నిమ్జ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి రజిత్ కుమార్ షైనీ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ఝరాసంగం మండలం బర్దిపూర్, ఎల్గోయ్, చిలపల్లి గ్రామ శివార్లలో కొనసాగుతున్న నిమ్జ్ అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారులు, మురుగు నీటి కాలువలు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక వసతుల పనుల పురోగతిని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు పురోగతి, అభివృద్ధి పనుల వేగవంతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? అని అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జహీరాబాద్ నిమ్జ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారీ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమమవడంతో పాటు స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story