- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుట్‌పాత్.. పాదచారులకు మరణ శిక్ష?
మనం రోజూ చూస్తూనే ఉంటాం. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినప్పుడో లేదా సిగ్నల్ పడ్డప్పుడో కొందరు ద్విచక్ర వాహనదారులు తమ బైక్‌లను ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి నడుపుతుంటారు.

దిశ, ఫీచర్స్: మనం రోజూ చూస్తూనే ఉంటాం. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినప్పుడో లేదా సిగ్నల్ పడ్డప్పుడో కొందరు ద్విచక్ర వాహనదారులు తమ బైక్‌లను ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి నడుపుతుంటారు. ఐతే.. పాదచారులు పక్కకైనా తప్పుకోవాలి లేదంటే భయంతో రోడ్డు మీదకైనా దిగాలి. ఇది ఏదో ఒకరోజు జరిగే సంఘటన కాదు. ప్రతీ రోజు.. ప్రతీ చోటా.. జరుగుతున్న వాస్తవ కథ. ఇదంతా రూల్స్ తెలియక కాదు. ‘మనల్నెవడ్రా ఆపేది?’ అనే ఒక లెక్కలేని తనంతో చేసే నిర్లక్ష్యం.
ఫుట్‌పాత్‌పై హక్కు లేదా?
జనాలు కొందరు రోడ్డు మీదికి రాగానే సైకోల్లా మారిపోతారు. మిగతా వాహనదారులంతా తనకు శత్రువులు అన్నట్లుగా ఫీలవుతుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా రోడ్డు వాళ్ల అయ్య జాగీరైయినట్టే న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. అలాంటి చెత్త పనుల్లో ఒకటి ఫుట్‌పాత్‌లపైకి వాహనాలు ఎక్కించడం. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు. ఫుట్‌పాతేమైనా తమ పెరటి స్థలం అనుకుంటారో ఏమో అర్థమే కాదు. అరే బాబూ.. ఫుట్‌పాత్ మీద వాహనం నడపడం వల్ల ట్యాంకర్ ఢీకొట్టి పిల్లాడు చనిపోయాడని సుప్రీం కోర్టు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాదచారులకు ఫుట్‌పాత్ మీద కూడా నడిచే హక్కు లేదా ఏంటి?
పాదచారులకా.. బైకులకా?
మనం సేఫ్‌గా ఉంటే చాలు.. అది ఫుట్‌పాత్ అయితే మనకేంటి.. దానిపై పాదచారులు వెళ్తే మనకేంటి అనే ఆలోచనా ధోరణి ఎక్కువైంది జనాలకు. చూస్తున్నాం కదా? మనంతట మనం నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటే హఠాత్తుగా వెనుక నుంచి ఎవడో ఒకడు హారన్ కొడతాడు. తప్పుకోకపోతే ఇక మన పని ఫినిష్. అసలేంటండీ ఈ న్యూసెన్స్? ఫుట్‌పాత్ పాదచారుల కోసమా? బైకులు నడపడానికా? అంత తొందర ఉన్నవాళ్లు ట్రాఫిక్ లేని.. ఏమాత్రం ఆలస్యం జరగని ఆకాశ ప్రయాణాన్ని ఎంచుకోవాలి. అంతేగానీ రోడ్డు మీదకి ఎక్కి.. ఇక అంతా నా ఇష్టం అనుకుంటే నడవదు.
తప్పుదారి పట్టించొద్దు కదా?
ఇంటర్నెట్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఒకతను బైకును మెల్లగా ఫుట్‌పాత్ మీదికి తిప్పుతాడు. సిగ్నల్ పడగానే వాహనాలు ఆపిన వాళ్లందరిదీ తప్పు అన్నట్టు అతగాడు ఎక్కడా ఆపకుండా దర్జాగా ఫుట్‌పాత్ మీది నుంచి వెళ్లిపోతుంటాడు. దీనిని చూసినవాళ్లు ‘మనోడి పనే మంచిగుంది కదా’ అని అనుకుంటారు. అంటే వ్యవస్థ రూల్స్ ప్రకారం వెళ్తుంటే దాన్నికూడా తప్పుదారి పట్టించేందుకు కొందరు కంకణం కట్టుకొని చిల్లర వేషాలు వేస్తుంటారు. హడావిడి ఉండొచ్చు.. ఆత్రం ఉండొచ్చు.. ఎవరూ కాదనడం లేదు. కానీ ఆత్రం ఉందని ఆగమాగం చేసి పోవడం కరెక్టు కాదు కదా?
బాధితులు ఎవరంటే?
ఫుట్‌పాత్‌ల మీద వాహనాలు నడిపే ధోరణిని ఒక రచయిత ‘The Great Indian Flip’గా అభివర్ణించారు. మేం ఇండియన్స్ అని ఎక్కడైనా చెప్పుకుంటే.. ‘ఓహో.. ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపించే దేశానికి చెందిన వాళ్లా?’ అంటూ ఇజ్జత్ తీసే పరిస్థితి ఏర్పడుతోంది. రాను రాను ఇలా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితికి కారణమైన వాళ్లు బాగానే ఉంటారు కానీ మరక మొత్తం సమాజానికి అంటుకుంటుంది. ఎటొచ్చీ సామాన్య జనాలే బాధితులుగా మిగిలిపోతున్నారు. పొద్దున్నే ఆఫీసుకు వెళ్తున్న వారు.. పిల్లలను స్కూలుకు తీసుకెళ్లే తల్లి.. మార్కెట్‌కు వెళ్లే ముసలాయనే ఇబ్బంది పడతారు.
ప్రశ్నించడానికి పోలీసులే కావాలా?
‘రోడ్లపై కాకుండా ఫుట్‌పాత్‌పై ఎందుకు వెళ్తున్నారు? ఇది తప్పు కదా?’ అని ఎవరైనా అడిగితే ఎలా స్పందిస్తారంటే.. ‘మీకెందుకు? అసలు మీరెవరు? మీరేమైనా పోలీసులా నన్ను అడగడానికి?’ అంటూ వితండవాదం చేస్తారు. కొందరైతే ‘మీరేమైనా అధికారులా?’ అని వకీల్ పాయింట్లు మాట్లాడతారు. రూల్స్ పాటించాలనే మినిమమ్ కామన్ సెన్స్ ఉండదుగానీ.. లాజిక్కులు, లా పాయింట్లు మాట్లాడుతుంటారు. ఎంత తెలివిమంతులో కదా? అదే తెలివిని రూల్స్ పాటించడంలో.. ఎదుటి వారికి మర్యాద ఇచ్చి మంచి రోడ్ సెన్స్ ఫాలో అవడంలో పాటిస్తే బాగుంటుంది కదా?
అంత చిన్న చూపా?
ఈ ధోరణి చిన్న సమస్య మాత్రమే కాదు. సమాజంలో చట్టం పట్ల గౌరవం లేకపోవడం అనే రోగంతో బాధపడే వాళ్లందరిలో కనిపిస్తున్న పెద్ద సమస్య. వీళ్లకు రూల్స్ తెలియక కాదు చట్టంపై చిన్నచూపు. మనుషుల పట్ల ఏహ్య భావం. చట్టం అందరికీ సమానమని తెలిసి చేసే వికృత పని. ఎవరూ అతిక్రమించకూడదు అనే నిబంధన ఉన్నందుకు దానిని అతిక్రమించి చూద్దాం అనే ఒక చిల్లర మనస్తత్వం ఉన్నవాళ్లే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తుంటారు. అందుకే ఎవరైనా అడిగితే ‘మీరెవరు అడగడానికి’ అంటూ తప్పును సమర్థించుకుంటారు. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు.
వేచి ఉంటే వృథా చేసినట్లా?
మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే ఆగిపోతాం. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడేదాక అలానే ఉంటాం. అయితే ఫుట్‌పాత్‌పై ఎక్కి వెళ్లేవాళ్ల దృష్టిలో ఇది టైం వేస్ట్ పని. ఏదో జయించామని వేగంగా వెళ్తూ వెనక్కి తిరిగి వేలు చూపిస్తారు. ‘మీలా అమాయకుల్లా సిగ్నల్ దగ్గర వేచి సమయం వృథా చేసుకోకుండా.. ఎలా ముందుకు వెళ్లామో చూడండి’ అంటూ వెకిలి నవ్వులు నవ్వుతుంటారు. సిగ్గు లేకుండా రూల్స్ బ్రేక్ చేసి.. ట్రాఫిక్‌ను అస్తవ్యస్తం చేయడమే కాకుండా గొప్ప పని చేసినట్లు ఫీలవ్వడం.. వాళ్ల అహంకార ధోరణికి నిదర్శనం. సిగ్నల్ దగ్గర ఆగితే టైం వేస్ట్ అనుకునే వాళ్లు జీవితంలో ఆ ఆదా చేసిన టైంతో ఏం సాధించారో మరి?
ఎప్పుడు గర్వపడాలి?
ఇతరులకు ప్రమాదం కలిగించి గర్వపడటం కాదు. మనకంటూ వ్యవస్థలో కొన్ని రూల్స్ ఉన్నాయి.. వాటిని ఫాలో అయ్యి గర్వపడాలి. సిగ్నల్ దగ్గర ఆగి గర్వపడాలి. ఫుట్‌పాత్‌పైకి వెళ్లకుండా నియమాలు పాటించి గర్వపడాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అంటే ఇతరుల భద్రతను గౌరవించడం అన్నమాట. ఫుట్‌పాత్‌పై నుంచి వెళ్లి ఇతరులకు ప్రమాదం కలిగించడం ఏ కోణంలో సరైనదో అప్పుడు ఆలోచించాలి గళ్లా ఎగరేయడం గురించి. అంతేగానీ ఎంత చెప్పినా విని.. ‘వీడు మారడ్రా బాబూ.. ఇలాంటి వాళ్లు మారతారు అనుకోవడం వృథా ప్రయాస’ అనే పరిస్థితికి దిగజారొద్దు.
అదే మీకు జరిగితే?
సరే మీరు రూల్స్ పాటించరు. చట్టాన్ని గౌరవించరు. ఫుట్‌పాత్‌పై బైక్ నడిపి పాదచారులను భయపెడతారు బాగానే ఉంది. కానీ ఒకసారి ఆలోచించండి. ఇంకెవడో రూల్స్ లెక్క చెయ్యని మీలాంటోడు అచ్చం మీలాగే ఆలోచించి రూల్స్ బ్రేక్ చేస్తూ ఫుట్‌పాత్‌పై వాహనాలు నడిపారే అనుకుందాం. ఆ ఫుట్‌పాత్‌పై మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు వెళ్తే? ఆ రూల్స్ బ్రేక్ చేసినోడు యాక్సిడెంట్ చేస్తే? ప్రమాదం తీవ్రంగా ఉంటే? మీ మనసు బాధపడుతుందా లేదా? మీలాగే అవతలి వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా? మీకు జరిగితే ఒకలా.. వేరే వాళ్లకు జరిగితే ఒకలా ఉండదు కదా?
ఢీకొంటూ ఏం సాధిస్తారు?
ఫుట్‌పాత్‌పై బైక్ నడిపి.. పాదచారులను హెచ్చరిస్తూ సాధించేది ఏముంటుంది? మహా అంటే కొంత సేపు ఈగో సంతృప్తి చెందుతుండొచ్చు. కొద్ది నిమిషాల ముందు గమ్యం చేరవచ్చు. అంతేగానీ.. మీ విగ్రహాలెవరూ మ్యూజియంలో పెట్టరు. తొందరగా వచ్చారని మీకు ఏ పురస్కారం రాదు. మరి అవేవీ లేనప్పుడు ఎందుకీ పనికిరాని కథలు? ప్రమాదం జరిగితే మన కుటుంబమే కాదు.. ఇతరుల కుటుంబాలు కూడా బాధపడతాయి. ఐదు నిమిషాల ఆత్మసంతృప్తి కోసం వందేళ్ల భవిష్యత్‌ను నాశనం చేసుకోవడం కరెక్టే అనిపిస్తే ఫుట్‌పాత్‌పైనే హాయిగా బైక్ నడపండి.
విదేశాల్లో ఇలాగే ఉంటుందా?
మన దగ్గర ఇదంతా కామనైపోయింది. ఐతే.. జపాన్‌లో ఫుట్‌పాత్‌లు పాదచారులకు మాత్రమే. బైక్ రైడర్లు ఫుట్‌పాత్‌పై వెళ్తే కఠిన జరిమానాలుంటాయి. జర్మనీలో సైకిల్ లేన్‌లు, ఫుట్‌పాత్‌లు స్పష్టంగా విభజించబడి ఉంటాయి. ఫుట్‌పాత్‌పై మోటార్ వాహనాలు నడపడం దాదాపు అసాధ్యం. ప్రజలు డిసిప్లిన్‌గా ఉంటారు. అమెరికాలో సైడ్‌వాక్‌పై చిన్న పిల్లల సైక్లింగ్‌కు అనుమతి ఉంటుంది. బైకులు ఫుట్‌పాత్‌పై వెళ్తే శిక్ష కఠినంగా ఉంటుంది. చైనాలో ఫుట్‌పాత్‌లపై బైకులు నిషేధం. మొత్తానికి ఈ దేశాల్లో రూల్స్ మాత్రమే కాదు వాటి అమలు విధానం కూడా స్ర్టిక్ట్‌గా ఉంటాయి. జనాల్లో ఆ భయం కూడా బాగుంది.
ప్రజలు సహకరిస్తే
ప్రతిరోజు మేము ఫుట్‌పాత్‌పై వెళ్తున్న బైకర్లను అడ్డుకుంటాం. చాలామంది తొందరగా వెళ్లాలి అనే ఆత్రంలో వెళ్తుంటారు. కొందరు కావాలనే వెళ్తారు. ఎలా వెళ్లినా ఇది చట్టవిరుద్ధం. అందుకే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం జరిమానా వేస్తున్నాం. పాదచారుల భద్రత కూడా ముఖ్యమే కదా. ప్రజలు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఫుట్‌పాత్‌లు పాదచారులకు మాత్రమే అని మరవద్దు.
- సురేష్, ట్రాఫిక్ పోలీస్, ఇబ్రహీంపట్నం
మన అందరి బాధ్యత
ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడపడం పాదచారుల హక్కును హరించడం. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎంత భయపడతారో చూస్తుంటే బాధ వేస్తుంది. సుప్రీం కోర్టు కూడా ఈ హక్కును గుర్తించింది. మనం రూల్స్ పాటించకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లా ఎలా ఉంటాం? ఇలాంటివి జరిగితే చూస్తూ ఉండటం కాకుండా ప్రజలు ఫిర్యాదు చేయాలి. ఫుట్‌పాత్‌లు సురక్షితంగా ఉండాలి. ఇది మన అందరి బాధ్యత.
- మహ్మద్ గౌస్, సామాజిక కార్యకర్త






