నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప గౌరవం: యామీ గౌతమ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-20 05:55:32  IST  )

ఆర్టికల్ 370' సినిమాకు జాతీయ అవార్డు అందుకోవడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప గౌరవమని చెప్పారు.

నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప గౌరవం: యామీ గౌతమ్
X

దిశ, సినిమా: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నవారి దృష్టంతా ఆర్టికల్-370పై పడింది. రిలీజ్ టైమ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఉత్తమ చలనచిత్ర అవార్డుతో పాటు.. ఇందులో అద్భుతమైన నటను కనబరిచిన యామీ గౌతమ్‌కు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. తాజాగా, ఈ విషయంపై యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఈ అవార్డు తన 14 ఏళ్ల సినీ ప్రయాణానికి, పట్టుదలకు, సినిమాపై తనకున్న నమ్మకానికి దక్కిన గౌరవమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీలో తాము ఎందుకు వెనకడుగు వేయలేదు అని గుర్తుచేసే ఒక అద్భుతమైన క్షణం వస్తుందని, తన జీవితంలో ఈరోజు అలాంటి క్షణమేనని ఆనందం వ్యక్తం చేశారు. 'ఆర్టికల్ 370' సినిమాకు జాతీయ అవార్డు అందుకోవడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప గౌరవమని చెప్పారు. 37 ఏళ్ల యామీ గౌతమ్ తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదని, కేవలం పనిపై శ్రద్ధ పెట్టానని తెలిపారు.

గత 14 ఏళ్లుగా తన వృత్తికి నిజాయితీగా ఉంటూ, తన నటన ద్వారానే సమాధానం చెప్పాలని ప్రయత్నించానని అన్నారు. ఈ అవార్డు తనలో ఎంతో ఆశను, ఓర్పును నింపిందని, తన మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఈ కల ఈరోజు నిజమవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జూని హక్సర్‌గా నటించడమే కాకుండా, ఇది తమ సొంత ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన సినిమా కావడంతో తనకు మరింత ప్రత్యేకం అని చెప్పారు. ఈ కథను ప్రేక్షకుల ముందుకు ఎంతో నిజాయితీగా తీసుకురావాలనే లక్ష్యంతోనే చిత్రబృందం అంతా కష్టపడిందని గుర్తుచేసుకున్నారు. జాతీయ అవార్డు జ్యూరీకి, డైరెక్టర్ ఆదిత్య సుహాస్ జంభాలేకు, చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్థవంతమైన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ విజయంతో మరోసారి నిరూపితమైందని అన్నారు. చివరగా, తన కెరీర్ హెచ్చుతగ్గుల్లో తోడుగా నిలిచిన తన కుటుంబానికి, టీమ్‌కు థాంక్స్ చెబుతూ.. ఈ జాతీయ అవార్డు తన ప్రయాణానికి ముగింపు కాదని, భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను ప్రేక్షకులకు అందించేందుకు తనపై బాధ్యతను మరింత పెంచిందని యామీ గౌతమ్ రాసుకొచ్చారు.

మెగా ఫ్యామిలీ హిస్టరీ మళ్లీ ఇలా రిపీట్ అవ్వడం నమ్మలేకపోతున్నా.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్

Next Story