- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం.. ఫెడరేషన్, చిరంజీవి చొరవతో పరిష్కారం
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది. అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. "ప్రస్తుతానికి సుమలత ఆధ్వర్యంలోనే కార్యవర్గం కొనసాగుతుంది. అసోసియేషన్‌లో ఎవరిపైనైనా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా కమిటీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 26వ తేదీన అసోసియేషన్ సభ్యులమంతా ఒకచోట కూర్చుని మిగిలిన అన్ని విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటాం" అని వల్లభనేని అనిల్ పేర్కొన్నారు.
నా వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందింది: జానీ మాస్టర్
మరోవైపు ఈ వివాదంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. అసోసియేషన్ వివాదానికి సంబంధించి ఫిలిం ఫెడరేషన్‌కు తాను పూర్తిస్థాయి వివరణ ఇచ్చానని, తన వివరణపై ఫెడరేషన్ పెద్దలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. యూనియన్‌లో ఎలాంటి విభేదాలు ఉన్నా వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు.
రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి.. సమస్య పరిష్కారం!
ఇండస్ట్రీలో ఏ పెద్ద సమస్య వచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారని జానీ మాస్టర్ తెలిపారు. ఈ డ్యాన్స్ యూనియన్ వివాదంపై చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వెల్లడించారు. "ఇండస్ట్రీలో తలెత్తిన ఈ సమస్యపై చిరంజీవి గారు నాతో, అలాగే శేఖర్ మాస్టర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడారు. యూనియన్‌లో ఉన్న అంతర్గత సమస్యలను ఆయనే స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారు" అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. మెగాస్టార్ రంగంలోకి దిగడంతో డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం సజావుగా ముగిసిందని ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.






