చిన్నారుల పౌష్టికాహారానికి ‘గ్రహణం’.. అంగన్‌వాడీ గుడ్ల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.

చిన్నారుల పౌష్టికాహారానికి ‘గ్రహణం’.. అంగన్‌వాడీ గుడ్ల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలకు పంపిణీ చేసే కోడిగుడ్ల సరఫరాలో జిల్లాల వారీగా గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2026 జులై నెలకు సంబంధించిన మొదటి బ్యాచ్ కోడిగుడ్ల ఇండెంట్ వాస్తవ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే కొన్ని జిల్లాలు వంద శాతం సరఫరాతో ఆదర్శంగా నిలవగా మరికొన్ని జిల్లాలు 85 శాతం కంటే తక్కువ సరఫరాతో వెనుకబడి ఉన్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు గుడ్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ జిల్లాలో 6,59,216 కోడిగుడ్ల డిమాండ్ ఉండగా, కేవలం 4,92,347 గుడ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. అంటే కేవలం 74.69 శాతం సరఫరాతో ఈ జిల్లా రాష్ట్రంలోనే ఆఖరి స్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లా కూడా 3,06,695 గుడ్ల ఇండెంట్‌కు గాను 2,32,889 గుడ్లను మాత్రమే సరఫరా చేసి 75.94 శాతం సరఫరాతో తర్వాతి స్థానంలో నిలిచింది. వీటితో పాటు జనగాం (82.36 శాతం), నల్గొండ (83.35 శాతం), మహబూబాబాద్ (83.95 శాతం), భద్రాద్రి కొత్తగూడెం (84.38 శాతం) జిల్లాలు కూడా 85 శాతం కంటే తక్కువ సరఫరాతో వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నాయి.

సిరిసిల్ల, భూపాలపల్లిలో వంద శాతం సరఫరా

ఇక పలు జిల్లాల అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లబ్ధిదారులందరికీ వంద శాతం గుడ్ల సరఫరా పూర్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1,46,094 గుడ్ల డిమాండ్‌కు గాను అంతే మొత్తాన్ని సరఫరా చేసి 100 శాతం రికార్డు సాధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా 2,29,885 గుడ్లను వందకు వంద శాతం సరఫరా చేసి ముందంజలో నిలిచింది. వీటితో పాటు జగిత్యాల (99.94 శాతం), పెద్దపల్లి (99.62 శాతం), నారాయణపేట (99.31 శాతం), మంచిర్యాల (99.21 శాతం) జిల్లాలు కూడా 99 శాతం కంటే ఎక్కువ సరఫరాతో టాప్ 6లో చోటు దక్కించుకున్నాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో మేడ్చల్, కరీంనగర్ వంటి పెద్ద జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున కొరత ఏర్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story