ఎల్‌నినో ప్రభావంపై అలర్ట్.. 8 జిల్లాల వాలంటీర్లకు జూబ్లీహిల్స్‌లో ట్రైనింగ్

by Jakkula.Mamatha |

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ కార్యాలయంలో సిల్క్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శక్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంపై అలర్ట్.. 8 జిల్లాల వాలంటీర్లకు జూబ్లీహిల్స్‌లో ట్రైనింగ్
X

దిశ,తలకొండపల్లి: పట్టు పరిశ్రమలో మల్బరీ సాగుపై ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించి పంట నాణ్యత, దిగుబడిని కాపాడే లక్ష్యంతో ఈ నెల 20న సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ కార్యాలయంలో సిల్క్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శక్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలతో శిక్షణ..

కేంద్ర సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే శాస్త్రీయ సాగు విధానాలు, పట్టు పంట నాణ్యత, దిగుబడి తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక సాగు పద్ధతులపై సిల్క్ వాలంటీర్లకు శిక్షణ అందించనున్నారు.

గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన..

శిక్షణ అనంతరం సిల్క్ వాలంటీర్లు గ్రామ స్థాయిలో పట్టు రైతులను కలిసి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, పంట సంరక్షణ పద్ధతులు, దిగుబడి పెంపునకు అనుసరించాల్సిన విధానాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఐదుగురు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, అదేవిధంగా రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి మొత్తం 34 మంది సిల్క్ వాలంటీర్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పట్టు రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి మెరుగైన నాణ్యతతో అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం కలుగుతుందని శక్రు నాయక్ తెలిపారు.

Next Story