న్యాయం చేయకుండా భూములు తీసుకోవడం సరికాదు

by Taduka Kalyani |

బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ పేరుతో బహదూర్ గూడ రైతులకు తగిన న్యాయం చేయకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

న్యాయం చేయకుండా భూములు తీసుకోవడం సరికాదు
X

దిశ, శంషాబాద్: బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ పేరుతో బహదూర్ గూడ రైతులకు తగిన న్యాయం చేయకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం వారు శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందలాది మంది రైతుల జీవనాధారమైన 650 ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోవడం ఎంతో దుర్మార్గమని విమర్శించారు. రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అదే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూడడం సరికాదని ఆరోపించారు. రైతులకు జీవనాధారమైన భూములు లాక్కోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రతి ఎన్నికల సమయంలోనూ రైతులకు కలబొల్లి హామీలు ఇచ్చి మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమైన బీజేపీ నేతలు వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు తగిన న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలిపారు. గ్రామస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story