నాంపల్లి అగ్నిప్రమాదం.. ఇంకా లభ్యం కాని లోపల చిక్కుకున్న వారి ఆచూకీ

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-25 04:43:13  IST  )

నాంపల్లిలో శనివారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నీచర్ దుకాణంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు.

నాంపల్లి అగ్నిప్రమాదం.. ఇంకా లభ్యం కాని లోపల  చిక్కుకున్న వారి  ఆచూకీ
X

దిశ,హైదరాబాద్ బ్యూరో: నాంపల్లిలో శనివారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నీచర్ దుకాణంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ భవనం లోపలి నుండి లోనికి వెళ్లలేనంతగా పొగలు, భవనం పై కప్పు నుంచి శిథిలాలు పడుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఇప్పటి వరకు లోపల చిక్కుకున్నది ఎంతమంది అనే విషయంలో క్లారిటీ లేదు. కొంత మంది ఐదుగురు అంటుండగా అంతకుమించే ఉన్నారనే టాక్ నడుస్తోంది. అర్ధరాత్రి తర్వాత లోపల చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించవచ్చని అధికారులు ముందుగా భావించినప్పటికీ పొగ, వేడిమి కారణంగా ఆదివారం ఉదయం వరకు కూడా లోనికి వెళ్లలేకపోయారు.

దీంతో లోపల చిక్కుకున్న వారి బంధువులు, స్నేహితులు ప్రమాదం చోటు చేసుకున్న భవనం వద్దనే రాత్రంతా తమ వారి గురించి ఎదురు చూస్తూ గడిపారు .మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా , మరో 8 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా భవనం పటిష్టతను గుర్తించేందుకు గాను జేఎన్టీయూ నుండి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పోలీసులతో వాగ్వాదం..

రాత్రంతా చలిలోనే పడిగాపులు కాసిన తమ వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో లోపల చిక్కుకు పోయిన వారి బందువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోందని, దుకాణ యాజమాన్యం లోపల ఉన్న ఫర్నీచర్ ను తరలిస్తున్నారని, తమ వారి గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొంత మంది భవనంలో ఉన్న వారు క్షేమంగా బయటకు రావాలని అక్కడే ప్రార్థనలు చేశారు. మొత్తం మీద అక్కడున్న బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ప్రమాదం మొదలై ఇన్ని గంటలు గడుస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోపల చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారంతా బయటకు క్షేమంగా రావాలని భగవంతున్ని కోరుకుంటున్నారు.

Read More... 18 గంటలుగా కొనసాగుతున్న మంటలు.. రంగంలోకి JNTU నిపుణులు

నాంపల్లి బచ్చస్ ఫర్నిచర్ యజమానిపై కేసు నమోదు

BREAKING: నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్.. ఒకరి డెడ్ బాడీ వెలికితీత

Next Story