ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ శుభవార్త.. ఏపీ బడ్జెట్‌లో వరాల జల్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-14 07:25:30  IST  )

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ కేటాయింపులు జరిగాయి. బీసీ కాంపోనెంట్ కోసం రూ. 51,021 కోట్లు, ఎస్సీలకు రూ. 20,644 కోట్లు కేటాయించి ప్రభుత్వం సంక్షేమ పర్వానికి నాంది పలికింది. రహదారులు, ఇంధనం మరియు గృహనిర్మాణ శాఖలకు సైతం వేల కోట్ల నిధులను కేటాయించింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ శుభవార్త.. ఏపీ బడ్జెట్‌లో వరాల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమానికి పెద్దపీట వేసింది. సమాజీక వర్గాలు, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Finance Minister Payyavula Keshav) అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించారు. బీసీ కాంపోనెంట్ కోసం ఏకంగా రూ. 51,021 కోట్లు కేటాయించడం ఆ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోంది. అలాగే ఎస్సీ కాంపోనెంట్ కోసం రూ. 20,644 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ కోసం రూ. 9,190 కోట్లు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం రూ. 6,090 కోట్లు కేటాయించి ప్రభుత్వం ఆయా వర్గాలకు భారీ శుభవార్త వినిపించింది.

సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించింది. రాష్ట్రంలోని పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖకు రూ. 6,357 కోట్లు కేటాయించారు. అలాగే ప్రజారవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 9,856 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి ఈ బడ్జెట్ బాటలు వేయనుంది.

మరోవైపు ఇంధన (ఎనర్జీ) శాఖకు రూ. 13,934 కోట్లు కేటాయించడం ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా, ఇంధన భద్రతకు ప్రభుత్వం భరోసానిచ్చింది. కార్మిక వర్గాల సంక్షేమానికి సైతం రూ. 735 కోట్లు కేటాయించారు. విద్య, వైద్యం, సామాజిక భద్రతతో పాటు ఈ కేటాయింపులు వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమాల మేళవింపుగా కనిపిస్తోంది.

AP Budget: రాజధాని అమరావతికి మహర్దశ.. బడ్జెట్‌‌లో భారీగా నిధుల కేటాయింపు

AP Budget: రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన

Next Story