AP Budget: రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-14 07:24:24  IST  )

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పూర్తి, నిరుద్యోగ భృతి, మహిళా సాధికారతకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

AP Budget: రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల అనంతరం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆదేశించారు. అనంతరం ఆ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలను మంత్రి సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పద్దుల ప్రకటన మాత్రమే కాదని, 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు. మొత్తం రూ.3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్, రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు కాగా, రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లుగా ఉందని సభకు తెలిపారు. ఇక మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ. 64,362 కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,25,845 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ. 11,473 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం అనేవి రెండు చక్రాల వంటివని, వీటిని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా, సంపద సృష్టి ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు.

రాయలసీమ రైతుల కలల సాకారం..

సాగునీరు అందక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న రాయలసీమ రైతాంగానికి ఈ బడ్జెట్ అండగా నిలవనుందని మంత్రి పయ్యావుల అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, సీమలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. తద్వారా దశాబ్దాల కాలంగా ఉన్న రైతుల కలలను సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు.

నిరుద్యోగులకు ధైర్యం.. గృహిణులకు భరోసా

ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్న శ్రీకాకుళం జిల్లా పట్టభద్రులకు ఈ బడ్జెట్ గుండె నిబ్బరాన్ని ఇస్తుందని, స్థానికంగానే అవకాశాలు కల్పించేలా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సామాన్య గృహిణికి కొండంత ఆశనిస్తూ, ఆమె భవిష్యత్తుకు ఈ బడ్జెట్ ద్వారా భరోసా కల్పించామని అన్నారు. కోస్తా తీరంలోని మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేలా వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, స్ఫూర్తినిచ్చే పథకాలను ఈ బడ్జెట్‌లో పొందుపరిచామని వెల్లడించారు.

శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

పాఠశాల విద్య: రూ.32,308 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.23,650 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ: రూ.22,641 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖ: రూ.19,306 కోట్లు

నీటి వనరుల శాఖ: రూ.18,223 కోట్లు

ఇంధన శాఖ: రూ.13,934 కోట్లు

వ్యవసాయ శాఖ: రూ.11,745 కోట్లు

సామాజిక సంక్షేమం: రూ.11,118 కోట్లు

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు

గ్రామీణాభివృద్ధికి: రూ.22,941 కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు

రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు

పరిశ్రమలకు రూ.3,161 కోట్లు

సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు

వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు

గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు

జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు

విశాఖ ఎకనామిక్ జోన్‌కు రూ.28,000 కోట్లు

రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు

పర్యావరణం, అటవీ, విజ్ఞానానికి రూ.714 కోట్లు

పట్టాణాభివృద్ధి శాఖకు రూ.14,539 కోట్లు

AP Budget: 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం..

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ శుభవార్త.. ఏపీ బడ్జెట్‌లో వరాల జల్లు

AP Budget: రాజధాని అమరావతికి మహర్దశ.. బడ్జెట్‌‌లో భారీగా నిధుల కేటాయింపు

Next Story