విజయవాడలో దారుణం.. యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం

by Naga Rani Yarlagadda |

ఆడపిల్ల కాస్త అమాయకంగా, ఒంటరిగా ఉంటే చాలు. కామాంధులు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూసి మరీ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.

విజయవాడలో దారుణం.. యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్ల కాస్త అమాయకంగా, ఒంటరిగా ఉంటే చాలు. కామాంధులు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూసి మరీ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. యువతికి జిమ్ ట్రైనర్ గా పరిచయమైన వ్యక్తి.. ఆమెను మాయమాటలతో నమ్మించి, మత్తుమందిచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న యువతికి అబ్దుల్ ఖాదర్ అనే జిమ్ ట్రైనర్ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపిన ఖాదర్.. ఆమె అధికబరువుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. తాను ఎలాగూ జిమ్ ట్రైనర్ ను కాబట్టి.. బరువు తగ్గడంలో సలహాలు ఇస్తానని నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మిన ఆమె.. అతను ఏం చెప్పినా సరేనంది. ఈ క్రమంలో డైట్ గురించి చెప్తానని ఓ ప్రైవేట్ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ముందుగా బరువు తగ్గాలంటే ఈ షేక్ తాగాలంటూ.. ఒక షేక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆ విషయం తెలియక దానిని తాగిన యువతి స్పృహ కోల్పోయింది. ఆమెపై అత్యాచారం చేసి, నగ్నంగా ఉన్న ఫొటోలు తీశాడు. ఆమెకు స్పృహ వచ్చాక జరిగింది తెలుసుకుని.. సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడైన ఖాదర్ పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story