తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్.. వారి గురించి ఆరా!

by Prasad Jukanti |   (  Updated:2026-07-20 14:22:48  IST  )

తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల వరుస పర్యటనలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ ఉండబోతోందన్న వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్ అయ్యాయి.

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్.. వారి గురించి ఆరా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పార్టీ ఫోకస్ పెంచింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మిగిలిన పశ్చిమబెంగాల్‍ దక్కించుకున్న కమలనాధులు అదే స్ట్రాటజీతో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నమైన వ్యూహాలతో రాజకీయం కొనసాగిస్తుండటం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిని పెంచుతోంది. నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర నేతల అంతర్గత కుమ్ములాటలతో విసిసిగిపోయిన పార్టీ జాతీయ నాయకత్వం.. ఇక స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా నెలరోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు ఉండబోతున్నాయని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‍గా మారింది.

మొన్న నడ్డా.. తాజాగా నితిన్ నబీ:

రాష్ట్ర స్థాయి నేతల్లో ఉన్న విభేదాలను తొలగించి వారి మధ్య సఖ్యతను తీసుకువచ్చేలా చేయడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపేలా ఇకపై నెలకు ఒకసారి జాతీయ స్థాయి నేత ఒకరు రాష్ట్రంలో పర్యటించేలా ప్రక్క ప్రణాళిక వేసుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణను ఎగ్జిక్యూటీవ్ చేస్తోంది. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో ఒక పూటకో ఒక రోజుకో పర్యటనకు వచ్చేవారు. కానీ ఇటీవల కొత్తగా పార్టీ జాతీయ బాధ్యతలు తీసుకున్న నితిన్ నబీన్ మాత్రం గత నెలాఖరులో ఏకంగా మూడురోజుల పాటు తెలంగాణలో పర్యటించడం ఆసక్తిని రేపింది. ఆ తర్వాత వెంటనే మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటించడం రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్‍గా మారింది. త్వరలోనే అమిత్ షా, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇలా అగ్రనేతల వరుసగా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్.. నెల రోజుల్లో ఊహించని పరిణామాలు!:

జాతీయ నాయకత్వం రాష్ట్రానికి వచ్చి వెళ్లడం ఒక ఎత్తైతే వచ్చిన నేతలు ఆపరేషన్ ఆకర్ష్ గురించి మాట్లాడటం స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతోంది. ఈనెలారంభంలో తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం తనకు ఉందని హాట్ కామెంట్స్ చేశారు. అలాగే వేరే పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడే పార్టీ మరింత బలపడుతుందని, తన సొంత రాష్ట్ర అనుభవాలను మన రాష్ట్ర నేతలకు వివరించడం ఆసక్తిని రేపింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అభయ్ పాటిల్ వ్యాఖ్యలు సెన్సేషనల్‍గా మారాయి. పార్టీలోని ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆయన.. రానున్న నెల రోజుల వ్యవధిలో తెలంగాణ బీజేపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా తాము త్వరలోనే డోర్స్ ఓపెన్ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీల నుంచి ఎవరెవరు బీజేపీలోకి వస్తారో అంతా చూస్తారని అభయ్ పాటిల్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్!:

తెలంగాణ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం స్పీడ్ పెంచడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ పెద్దలు మైండ్ గేమ్ ఆడుతున్నారా? లేక నిజంగానే తమ పార్టీ నేతలు వారితో టచ్‍లో ఉన్నారా అనే విషయాలను పార్టీ అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల సొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతల తాజా ఆలోచనలు? వారి నిర్ణయాలేంటి? అనే విషయాలను వారి సన్నిహితుల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ వీడటం ఖాయం అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‍లోనూ పదవులు ఆశిస్తూ దక్కకని అసంతృప్త నేతలు పార్టీ మారే చాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడుతామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్న వేళ తమ తమ పార్టీల్లో పక్క చూపులు చూస్తున్న నేతలెవరూ అనేదానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

Next Story